Kavitha:హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అవినీతి - ఫీజు పెంపు పై కవితా వార్నింగ్..!!
హైదరాబాదు పబ్లిక్ స్కూల్‌లో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని టీఆర్ఎస్ అధినేత్రి కవిత ధ్వజమెత్తారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య - ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
హెచ్‌పీఎస్‌లో భారీ అవినీతి
ఈ అవినీతి,అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న హెచ్ పీఎస్ ఈ ఏడాది 120 శాతం ఫీజు పెంచిందని చెప్పారు. ప్రభుత్వ స్థలంలో కొనసాగే స్కూళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే బడా ప్రైవేట్ స్కూళ్లలో పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకే వ్యక్తి గత 14 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ హెచ్‌పీఎస్ పూర్వపు విద్యార్థి అయిన సత్య నాదెళ్ల స్కూలుకు ఇచ్చిన విరాళాలకు లెక్కాపత్రం లేదని ఆమె అన్నారు.ఆ విరాళాలు దారి మళ్లాయని ఆమె ఆరోపించారు. క్యాంపస్‌లో 30 ఎకరాల మేరా భూమిని కబ్జా చేసే పనిలో సీఎం సన్నిహితులు కొందరున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్స్
ఇక పెరుగుతున్న ఫీజులపై మాట్లాడిన కవిత ఫీజు నియంత్రణ చట్టాలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీలను అరికట్టాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవాలకు వెళుతున్నారని ఎద్దేవా చేశారు.ఫీజుల విషయంలో దోపిడీని అరికట్టాల్సిందే అని డిమాండ్ చేసిన కవిత.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా జీవో జారీచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్య వైద్యం కోసమే కుటుంబాలు 60 నుంచి 70శాతం వరకు వారి ఆదాయాన్ని ఖర్చు చేస్తున్నారని గుర్తుచేశారు. తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే తల్లిదండ్రుల బలహీనతను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఆసరాగా చేసుకుని భారీగా ఫీజులు పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టకపోగా...ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా బొందపెట్టే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తోందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంఎస్-7 జీవో తో ఫీజు రీయింబర్స్ మెంట్ కు మంగళం పాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.తెలంగాణ రక్షణ సేన (TRS) అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో కూడా పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని మరోసారి తేల్చి చెప్పారు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు.త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications