ఈ ఏడాది AI పొగొట్టిన ఉద్యోగాలు ఎన్నో తెలిస్తే షాక్..!
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కృత్రిమ మేథ (ఏఐ) సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగుల జీవితాల్లోకి వేగంగా దూసుకొచ్చింది. దీని ప్రభావంతో పలు దేశాల్లో పరిస్ధితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ముఖ్యంగా కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ ను అమల్లోకి తెచ్చి ఉద్యోగులపై వేటు వేయడం ప్రారంభించాయి. గతంలో ఓ ఉద్యోగిని తొలగించారంటే ఎన్నో కారణాలు ఉండేవి. కానీ ఈ ఏడాది మాత్రం ఓ ఉద్యోగి తన ఉద్యోగం కోల్పోతే ఏఐ ప్రభావం అని చెప్పుకునే పరిస్ధితి వచ్చేసింది.
ఈ క్రమంలో ప్రపంచంలో దిగ్గజ టెక్ సంస్థలు సైతం ఏఐని తమ కార్యకలాపాల్లో అమలు చేస్తూ ఉద్యోగుల్ని వరుసగా లేఆఫ్ లు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఈ ఏడాది ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష ఉద్యోగాలు ఆవిరైనట్లు అంతర్జాతీయ సంస్థల రికార్డులు చెప్తున్నాయి. ఇందులో టెక్ ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇలా లేఆఫ్ లు ఇచ్చిన కంపెనీల్లో భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న టెక్ దిగ్గజాల వాటా ఎక్కువగా ఉంది.

భారత్ లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు వరుసగా వేల సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ లు ప్రకటించాయి. దీనికి ప్రధానంగా ఏఐ ఆధారిత పునర్ వ్యవస్దీకరణ, డిమాండ్ తగ్గడమే కారణంగా వెల్లడించాయి. ఇందులో ఒక్క టీసీఎస్ మాత్రమే ఒక్క త్రైమాసికంలో సుమారు 20,000 ఉద్యోగాలు తొలగించింది. ఏఐ బూమ్, ఆటోమేషన్ ఇందుకు కారణమైంది. ఇతర ఐటీ దిగ్గజాలు కూడా వేలాది ఉద్యోగాలు కోత విధించాయి.

ఈ గణాంకాలు ఏఐతో పాటు ఖర్చు తగ్గించుకోవడం, తగ్గిన డిమాండ్ వంటి కారణాలతో టెక్ దిగ్గజాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయని సూచిస్తున్నాయి. దీంతో అప్పటివరకూ ఐటీ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ కూడా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఐటీ సంస్థలు ఓపెనింగ్స్ కు దూరంగా ఉంటున్నాయి. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నా.. ఇంకా ఆ స్ధాయిలో ఓపెనింగ్స్ మాత్రం లేవు. ఉన్న ఉద్యోగాలకు సైతం ఏఐ బ్యాక్ గ్రౌండ్ అడగటం కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే కొత్త ఏడాదిలో టెక్ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు.












Click it and Unblock the Notifications