ఏఐ దెబ్బకు 2027 నాటికి మిడిల్ క్లాస్ అవుట్ ? గూగుల్ మాజీ ఉద్యోగి షాకింగ్ ..!
కృత్రిమ మేథ దూకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రతీ రంగంలోనూ ఏఐ రాకతో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ పని తీరుతో పాటు ఏ మార్పుకైనా సిద్ధం కావాల్సిన పరిస్దితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ దూకుడు కారణంగా ఇప్పటికే మొదలైన ఉద్యోగాల కోతలు మరో రెండేళ్లలో తీవ్రంగా మారి మధ్యతరగతిని కుప్పకూల్చబోతున్నాయంటూ ఓ అంచనా వెలువడింది.
గతంలో గూగుల్ లో ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతం 350 పని చేయాల్సిన చోట కేవలం ముగ్గురు ఉద్యోగులతో సంస్ధను నడుపుతున్న మో గోడాట్ అనే ఉద్యోగి ఏఐ దూకుడుపై సంచలన అంచనాల్ని వెల్లడించాడు. తన పాడ్‌కాస్ట్ 'డైరీ ఆఫ్ ఎ సీఈఓ'లో ఆయన ఓ భయంకరమైన అంచనాను ప్రకటించాడు. దీని ప్రకారం 2027 చివరి నాటికి ఏఐ పెను సవాళ్లు విసరబోతోందని హెచ్చరించారు.

ఏఐ గణనీయమైన మార్పులను తీసుకువస్తుందని, ఇది మధ్యతరగతి పతనానికి దారితీస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యంగా టాప్ 0.1 శాతంలో లేకపోతే మీరు రైతు కిందే లెక్క అని. మధ్యతరగతి అంటూ ఉండదని తేల్చిచెప్పేశారు. గతంలో తన పాడ్‌కాస్ట్‌లో పెళ్లి చేసుకున్న యువతకు ఆయన ఓ సలహా ఇచ్చారు. ఏఐ వల్ల వచ్చే ఉద్యోగ నష్టాల కారణంగా పిల్లల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేని సలహా ఇచ్చారు.

2027 నాటికి ఉన్నత విద్యావంతులైన వ్యక్తులు కూడా నిరుద్యోగులుగా మారవచ్చని, దీని ఫలితంగా ప్రస్తుత మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపే కొత్త ప్రపంచ తరగతి నిర్మాణం ఏర్పడవచ్చని మో గోడాట్ తాజా అంచనాలో తెలిపారు. ఏఐ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, పాడ్‌కాస్టర్‌లతో సహా వివిధ ప్రొఫెషనల్ పాత్రలను ఎలా తొలగిస్తుందో ఆయన వెల్లడించారు. 2027 ప్రారంభాన్ని ఆయన మనం స్వర్గానికి చేరుకునే ముందు నరకంగా అభివర్ణించారు. దీంతో ఇప్పుడు గోడాట్ అంచనాలు ఐటీ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications