AP Inter Exams 2024: ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం- అభ్యర్ధులూ ఇవి మర్చిపోకండి.. !
ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1559 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇవాళ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కాగా.. రేపు రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను 4.73 లక్షల మంది విద్యార్ధులు రాస్తున్నారు.ఇవాళ విద్యార్ధులు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాస్తున్నారు. రేపు ప్రారంభమయ్యే ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను 4.88 లక్షల మంది రాయనున్నారు. అలాగే వొకేషనల్ కోర్సుల పరీక్షలను దాదాపు లక్ష మంది విద్యార్దులు రాస్తున్నారు. వీరికి హాల్ టికెట్లను ఇప్పటికే అందజేశారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై.. మార్చి 19 వరకూ జరగనున్నాయి. అలాగే రెండో సంవత్సరం పరీక్షలు రేపు ప్రారంభమై.. ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగుతాయి. వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇప్పటికే ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అలాగే ఇవాళ్టి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులకు ఇంటర్ బోర్డు పలు సూచనలు చేస్తోంది. వీటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 57 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇందులో ముందుగా ఇంటర్ హాల్ టికెట్లను bieap.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. వీటిని డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకుని పరీక్షలకు వెళ్లాలి. రెగ్యులర్ విద్యార్ధులకు కాలేజీల్లో నేరుగా హాల్ టికెట్లను అందించారు. విద్యార్ధులు హాల్ టికెట్లను తప్పనిసరిగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలి. అలాగే కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి. పరీక్షకు వెళ్లేవారు నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అలాగే విద్యార్ధులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్ధులు కూర్చుని పరీక్షలు రాయాలి.












Click it and Unblock the Notifications