సీఏ విద్యార్థులకు అలర్ట్: ఇక, ఫైనల్ పరీక్షలు కూడా ఏడాదికి మూడు సార్లు!
చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) పరీక్షలకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కీలక ప్రకటన వెలువరించింది. 2025 నుంచి సీఏ ఫైనల్ పరీక్షల్ని కూడా ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సీఏ ఫైనల్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గత ఏడాది మార్చిలో సీఏ ఇంటర్, ఫౌండేషన్ కోర్సు పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించిన ఐసీఏఐ.. తాజాగా సీఏ ఫైనల్ పరీక్షలను కూడా అదే తరహాలో నిర్వహించనున్నట్లు ప్రకటన జారీ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందించేందుకు సీఏ ఫైనల్ పరీక్షల్ని కూడా ఏడాదిలో మూడుసార్లు నిర్వహించేలా చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సీఐఏఐ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా నిర్ణయంతో సీఏ ఫైనల్, ఇంటర్, ఫౌండేషన్ పరీక్షలు ఏడాదిలో మూడు సార్లు జరుగుతాయని పేర్కొంది. దీంతో విద్యార్థులు పరీక్షరాసేందుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది.
విద్యార్థులకు స్కాలర్ షిప్స్
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును మే 31 వరకు ఎస్సీ సంక్షేమ శాఖ పొడిగించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. 2024-2025 విద్యా సంవత్సరానికి 11,88,120 మంది విద్యార్థులకు గాను 10,34,074 మంది అప్లై చేశారు.
ఎంబీబీఎస్, పీజీ మెడికల్ ప్రవేశాలు ఇంకా పూర్తికానందున విద్యార్థుల వివరాలను కాళోజీ వర్సిటీ ఎస్సీ సంక్షేమశాఖకు ఇవ్వలేదు. వివరాలు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అప్లై చేయడానికి వీలు లేకుండా పోయింది. దీంతో స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవడానికి మే 31 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ-పాస్ వెబ్సైట్లో కళాశాలల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మే 31 వరకు అవకాశాన్ని ఇచ్చింది.












Click it and Unblock the Notifications