జానీ మాస్టర్‌పై అనసూయ సంచలన కామెంట్స్
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనని కొద్దికాలంగా జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారని మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆ డాన్సర్ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై సినీ ఇండస్ట్రీ సైతం సీరియస్‌గానే రియాక్ట్ అయింది. దీనిపై మీడియా సమావేశం నిర్వహించి, బాధితురాలికి అండగా నిలవడం జరిగింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది. మరోవైపు జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై యాంకర్ అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు.

అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ వివాదంపై సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళలకు సానుభూతి అవసరం లేదు. ఇంతకాలం ఆ అమ్మాయి అనుభవించిన బాధ చాలా దారుణమని ఆమె చెప్పుకొచ్చారు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు తమకు ఏదైనా ఇబ్బందులు తల్తెత్తితే.. వెంటనే రియాక్ట్ కావాలని , బహిరంగంగా అందరికి తెలిసేలా చెప్పాలని అనసూయ చెప్పుకొచ్చారు. ఇలాంటి విషయంలో సానుభూతి అవసరం లేదని..ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని మహిళలకు హితవు పలికారు. మీరు గానీ, మీకు తెలిసినవాళ్లు గాని అసౌకర్యమైన, అగౌరవకరమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నారని తెలియగానే వాటిని వెంటనే ప్రతిఘటించాలని మహిళలకు అనసూయ సూచన చేశారు. మీకు అందరూ తోడుగా నిలబడుతారనే విషయం మర్చిపోకూడదని ఆమె తెలిపింది.
నేను బాధితురాలితో కొన్ని రోజులు పనిచేశాను. 'పుష్ప' సెట్స్ లో రెండు, మూడుసార్లు చూశాను. కానీ, ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు బయటకు తెలియకుండా దాచిపెట్టింది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆ అమ్మాయి తన ప్రతిభ కనబరించిందనడంతో ఎలాంటి సందేహం లేదు. బాధితురాలుకు మద్దతుగా నిలువడానికి, మాట్లాడటానికి ముందుంటాను. ఈ కేసులో అమ్మాయికి న్యాయం అందించాలి. మున్ముందు ఇలాంటి పరిస్థితులు ఇండస్ట్రీలో ఏ మహిళకు ఎదురుకాకూడదని, సురక్షితమైన ప్రదేశంగా మారుతుందని ఆశిస్తున్నామని అనసూయ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. బాధితురాలికి అండగా నిలుస్తూ అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications