పవన్ కల్యాణ్ బయోపిక్ తీస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ రంగంలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. ఏపీ అసెంబ్లీకి పోటీచేసిన 21 స్థానాల్లోను ఘనవిజయం సాధించి అరుదైన రికార్డును జనసేన పార్టీ నెలకొల్పింది. భారతదేశ రాజకీయ రంగంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా తాను పోటీచేసిన అన్నిస్థానాల్లోను విజయం సాధించలేదు. వందశాతం స్ట్రైక్ రేటు సాధించిన పవన్ కల్యాణ్ పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీచేసిన పవన్ 70,354 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఇద్దరిదీ మంచి స్నేహం
సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ కు రచయిత, దర్శకుడు అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితుడు. పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ తరఫున కథలను వినడం, దర్శకుడిని ఎంపిక చేయడం, నిర్మాతలను ఎంపిక చేయడంతోపాటు ఆయా సినిమాలకు సంబంధించిన అన్ని పనులను ఆయనే పర్యవేక్షించేవారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో పవన్ కల్యాణ్ ప్రసంగాలకు మాటలు కూడా రాసిస్తారనే పేరు ఉంది. ఎంతోమంది వీరిద్దరి స్నేహాన్ని విడదీయాలని ప్రయత్నించారుకానీ సఫలం కాలేకపోయారు.

తన సొంత డబ్బులే..
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో రాజోలు నుంచి మాత్రమే జనసేన గెలవగలిగింది. రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన పవన్ రెండుచోట్లా ఓటమి పాలయ్యారు. అయినా పట్టుదలగా పార్టీని తన సొంత డబ్బులతో నడుపుకుంటూ వచ్చారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు కూడా తనకు సినిమాలద్వారా వచ్చే ఆదాయం నుంచే ఇచ్చారు.
కూటమిని ఏర్పాటు చేసి..
తెలుగుదేశం-బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటైన జనసేన బీజేపీ ఒత్తిడిద్వారా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చినా అంగీకరించారు. చివరకు వంద శాతం స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన రికార్డును నెలకొల్పారు. ఇటువంటి పవన్ కల్యాణ్ జీవిత చరిత్రను ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కథగా తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే దీన్ని సినిమాగా తీయబోతున్నట్లు తెలుగు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. కథ ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే నటీనటుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కాబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications