హోటల్ గదిలో సినీ నటుడి మృతదేహం – షాక్ లో ఇండస్ట్రీ
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు మిమిక్రీ కళాకారుడు కళాభవన్ నవాస్ మరణించారు. కొచ్చి చోటానికరలోని హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
కళాభవన్ నవాజ్ వయస్సు 51 సంవత్సరాలు. మరణానికి కారణం తెలియట్లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన గుండెపోటు కారణంగా మరణించారని తెలుస్తోంది. ఆయన భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఈ నివేదిక అందిన తరువాతే ఆయన మరణానికి గల కారణం వెలుగులోకి వస్తుంది.

'ప్రకంబనం' అనే సినిమాలో నటిస్తోన్నారు కళాభవన్ నవాజ్. షూటింగ్ ముగించుకుని సాయంత్రం తన హోటల్ గదికి చేరుకున్నాడు. ఆ తరువాత చాలా సేపటి వరకు గది నుండి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తనిఖీ చేయగా అపస్మారక స్థితి కనిపించారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.
శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రకంబనం సినిమా షూటింగ్ ముగించుకుని చొటనిక్కరలో గల హోటల్ కు బయలుదేరే సమయానికి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని యూనిట్ వెల్లడించింది. షూటింగ్ కు రెండు రోజుల విరామం ఉన్నందున తిరువనంతపురంలోని ఇంటికి వెళ్తానని తమతో చెప్పినట్లు తెలిపింది.
కళాభవన్ నవాస్ ఊహించని మరణంతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. 51 ఏళ్ల నవాస్ తన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారని సహచరులు చెబుతున్నారు. నవాస్ కు ఇతర చెడు అలవాట్లు లేవని, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండేవాడని స్పష్టం చేస్తోన్నారు.
కాగా.. హోటల్ యజమాని సంతోష్ మీడియాతో మాట్లాడారు. నవాజ్‌ను హోటల్ గది నుండి ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఆయన బతికే ఉన్నాడని అన్నారు. గది తలుపు తెరిచి ఉందని పేర్కొన్నారు. నవాస్ గదిలో పడి ఉండటాన్ని తొలుత హోటల్ రూమ్ బాయ్.. చూశాడు. డోర్ దగ్గరే నేలపై పడి ఉన్న స్థితిలో అతన్ని గమనించాడని, అప్పుడు గది తలుపులు తెరిచే ఉన్నాయని సంతోష్ చెప్పారు.
ఆ వెంటనే పోలీసుల, సినిమా ప్రొడక్షన్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. వారందరూ ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారని సంతోష్ చెప్పాడు. ఆ సమయంలో నవాస్ బతికే ఉన్నాడని చెప్పారు. నవాస్ గత 25 రోజులుగా ఈ హోటల్‌లో బస చేస్తున్నాడు. ప్రకంపనం సినిమా షూటింగ్‌లో భాగంగా నిర్మాణ బృందం ఈ హోటల్‌ను ఏర్పాటు చేసింది.
పమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని కలమస్సేరి మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగిస్తారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చొట్టనిక్కర పోలీస్ స్టేషన్ లో అసహజ మరణంగా కేసు నమోదైంది.
ఈ సాయంత్రం అలువా టౌన్ జుమా మసీదులో ప్రజల సందర్శన కోసం ఆయన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఖననం చేస్తారు. ఆయన భార్య.. ప్రముఖ నటి రెహానా. నవాస్ తండ్రి అబూబకర్, సోదరుడు నియాజ్ ఇద్దరూ సినీ నటులు.
నవాస్ రంగస్థల ప్రదర్శనల ద్వారా కళారంగంలోకి ప్రవేశించాడు. 500 కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. త్రిస్సూర్ జిల్లాలోని వడక్కంచెరి ఆయన స్వస్థలం. 1995లో చైతన్యం సినిమాతో అరంగేట్రం చేశాడు. మట్టుపెట్టి మచ్చన్, థిల్లానా థిల్లానా, మాయాజాలం, జూనియర్ మాండ్రేక్, మై డియర్ కరాడి, చట్టంబినాడ్, చక్కరముత్తు, మేరం నామ్ షాజీ, డిటెక్టివ్ ఉజ్వలన్‌తో సహా అనేక చిత్రాలలో నటించాడు.












Click it and Unblock the Notifications