శ్యామ్ సింగరాయ్ సెట్‌లో ఏడ్చేసిన సాయిపల్లవి.. ఎందుకంటే..?
లేడి పవర్‌స్టార్ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫిదా చిత్రంతో ఆమె తెలుగు వారికి అంతబాగా కనెక్ట అయ్యారు. తన అందం, నటన, డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం కంటెంట్ నటన ప్రాధాన్యత ఉన్న సినిమాలనే సాయిపల్లవి ఎంచుకుంటారు. అందుకే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక, ఇటీవల విడుదలయిన అమరన్ చిత్రంలో ఆమె నటన గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన సహజ నటనతో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న న్యాచురల్ బ్యూటీ ఓ సినిమా షూటింగ్‌లో తాను పడిన మానసిక ఒత్తిడి గురించి బయటపెట్టారు. ఆ మూవీ షూటింగ్ సెట్‌లో ఏకంగా సాయిపల్లవి ఏడ్చేసారంటా.? ఆ కారణాలేంటో తెలుసుకుందాం పదండి.
నేచురల్ స్టార్ నాని, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా 2021 డిసెంబర్‌లో వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది ఈ మూవీ. ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ షూటింగ్ జరిగే సమయంలో సాయి పల్లవి ఏడ్చారట. అమరన్ సక్సెస్ సందర్భంగా తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ షూటింగ్ రోజులలో తను పడిన మానసిక ఒత్తిడిని, బాధను బయటపెట్టారు.

ఒక్కరోజు రెస్ట్ దొరికొతే బాగుండు..
శ్యామ్ సింగరాయ్ షూటింగ్ చేస్తున్నపుడు ఆ రోజు షూట్ పూర్తయితే ఎంతో సంతోషంగా ఉండేది. నా సీన్స్ అన్నీ చాలా వరకూ నైటే షూట్ చేశారు. నాకు రాత్రి షూటింగ్‌లు అస్సలు అలవాటు లేదు. రాత్రి నిద్ర లేకుండా ఉండలేను. పగలు నాకు అస్సలు నిద్రరాదు కాబట్టి రాత్రిళ్లు నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కోసారి షూటింగ్ సమయంలో తెల్లారేవరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. సుమారు ఓ నెలరోజులపాటు షూటింగ్ ఇలానే గడిచింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా నైట్ శ్యామ్ సింగరాయ్ షూట్ చేస్తూ.. ఉదయం మరో మూవీ సెట్‌కి వెళ్లేదాన్ని.. అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు. ఓ రోజు నైట్ షూట్ చేస్తుంటే నన్ను చూసేందుకు చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా నాకు ఏడుపొచ్చేసింది. ఒప్పుకొన్న సినిమాలు చేయాలనుంది కానీ.. ఓ రోజు రెస్ట్ దొరికితే బాగుండు అంటూ నా బాధను తనతో షేర్ చేసుకున్నా. వెంటనే నా చెల్లి నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్లి.. మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. దాంతో ఆయన వెంటనే నా వద్దకు వచ్చి.. ఒకటి కాదు పది రోజులు తీసుకోమ్మా.. అంతా బాగా ఉంది అనుకున్నప్పుడు షూట్‌కు రా.. అన్నారు. దాంతో నాకు రెస్ట్ దొరికింది' అంటూ సాయిపల్లవి అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.












Click it and Unblock the Notifications