టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడి సీనియర్ నటి మృతి!
గత కొంతకాలంగా టాలీవుడ్‌ను వరుస విషాదాలు వేధిస్తున్నాయి. తాజాగా వెండితెరపై, బుల్లితెరపై తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వాహిని( వాసవి అలియాస్ పద్మ) బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు.
క్యాన్సర్‌తో పోరాడి ఓడిన వాహిని
సీనియర్ నటి వాహిన మరణవార్తను నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిస్తూ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. "వాహిని అక్కను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఆమె చివరకు విజయనగరంలో పరమపదించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ నటి కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి విజయనగరంలో పక్కపక్క ఇళ్లలోనే ఉండటం వల్ల వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. వాహిని అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమె వైద్య ఖర్చుల కోసం కరాటే కళ్యాణి పలువురి నుంచి విరాళాలు సేకరించి అండగా నిలిచారు.

విజయనగరం నుంచి వెండితెర వరకు.. వాహిని ప్రస్థానం
1978లో విజయనగరంలో జన్మించిన వాహిని.. సినీ పరిశ్రమలో 'జయ వాహిని'గా పేరు తెచ్చుకున్నారు. చిన్న పాత్రలతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె, తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించడంలో ఆమె దిట్ట. విలనీ పాత్రలతో ప్రేక్షకులను భయపెడుతూనే మెప్పించారు. సినిమాల కంటే టీవీ సీరియల్స్‌లోనే ఆమెకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఎన్నో హిట్ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ఇంటింటికీ చేరువయ్యారు. 2019లో వచ్చిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో వీకే నరేష్ సరసన నటించారు. ఆమె చివరిగా కనిపించిన చిత్రం 'బహిర్బూమి'.
ఆర్థిక ఇబ్బందులు.. దాతల సాయం
క్యాన్సర్ మహమ్మారి వాహినిని శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీసింది. ఆమె చికిత్స కోసం కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఈ విషయం తెలిసిన కరాటే కళ్యాణి ముందడుగు వేసి సోషల్ మీడియా ద్వారా సహాయం కోరారు. దీనికి స్పందించిన పలువురు సినీ నటులు, దాతలు ఆర్థిక సాయం అందించారు. అయినప్పటికీ.. క్యాన్సర్ నాలుగో దశకు చేరుకోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. చివరి రోజులను తన సొంత ఊరిలో గడపాలని ఆమెను విజయనగరం తీసుకురాగా.. అక్కడే ఆమె ప్రాణాలు విడిచారు.
సినీ లోకం సంతాపం
వాహిని మరణంతో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటనపై ఎంతో మక్కువ ఉన్న ఆమె, అనారోగ్యంలోనూ సోషల్ మీడియా రీల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై రాణించిన ఒక మంచి నటిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications