ఇండస్ట్రీలో నీలాంటోడు ఒక్కడున్నా చాలన్నా.. మూడు పువ్వులు ఆరు కాయలు..!!
ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ప్లాఫ్ అవుతుందో చెప్పడం ఎవరి వల్లా కాదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని చిన్న సినిమాలు సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో పాన్ ఇండియా మోజులో పడి చాలా మంది హీరోలు పెద్ద పెద్ద సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఓ స్టార్ హీరో నుంచి సినిమా రావాలంటే ఎంత లేదన్నా సంవత్సరం పైనే పడుతుంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తుంది. మిగతా సమయంలో వాటి వైపు కూడా ప్రేక్షకులు చూడటం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య ఓ స్టార్ హీరో ఏడాదికి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇమేజ్ గురించి మనకు తెలిసిందే. కెరీర్ తొలినాళ్ల నుంచే అటు తమిళంతోపాటు తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గజిని, యముడు, సెవెన్త్ సెన్స్ లాంటి చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. అయితే గతంలో కంగువ, రెట్రో లాంటి సినిమాలతో వరుస ప్లాఫ్ లు మూటగట్టుకున్న సూర్య.. ఈ ఏడాది మాత్రం మూడు నెలలకో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అటు ఫ్యాన్స్ ఆకలి తీర్చడమే కాకుండా.. సినిమా ఇండస్ట్రీకి, థియేటర్లకు సైతం మంచి ఊపును తీసుకొచ్చారు. ఈ ఏడాది కరుప్పు సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు సూర్య. ఈ చిత్రంలో సూర్య సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ మూవీని ఆర్. జే. బాలాజీ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ అనే సినిమా చేశారు. ఈ మూవీలో సూర్యకు జోడీగా మమిత బైజు హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా నవంబర్ 6 న సూర్య నుంచి మూడో చిత్రం కూడా వచ్చింది. అదే 'సీన్'.. ఈ మూవీలో సూర్యతోపాటు నజ్రియా నజీమ్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ విడుదలైన మొదటి రోజే ఇండియాలో రూ.19.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే వసూళ్ల కంటే ఎక్కువేనని సమాచారం అందుతోంది. అయితే సూర్య కెరీర్ లోనే కాకుండా 2026 లోనూ భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో సీన్ నిలిచింది. ఈ క్రమంలో సీన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. దాంతో సూర్య ఫ్యాన్స్ సంబరాల్లో ఉన్నారు. ఏటా ఇలాగే మూడు సినిమాలు తీయాలంటూ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
