అక్కినేని నాగార్జున 100వ చిత్రం బడ్జెట్ రూ.150 కోట్లు.. దర్శకుడు అతనే!
కింగ్ నాగార్జున ప్రస్తుతం కుబేర, కూలీ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన అతిథి పాత్రలు, ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమాల సంఖ్య కూడా కలుపుకుంటే 100 సినిమాలు ఎప్పుడో దాటిపోయినట్లు లెక్క. కానీ కథానాయకుడిగా మాత్రం 100వ సినిమా చేయలేదు. తాజాగా తన 100వ సినిమాను అత్యంత గ్రాండియర్ గా తెరకెక్కించాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నారు. అందుకోసం మంచి కథ, దర్శకుడి కోసం అన్వేషిస్తున్నారు. కుబేర, కూలీ పూర్తవగానే ఈ సినిమాను ప్రారంభించేలా ప్రణాళిక రచించుకుంటున్నారు.
చివరగా నా సామిరంగతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు
నాగార్జున హీరోగా వచ్చిన చివరి చిత్రం నా సామిరంగ. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జునకు సమవుజ్జీలైన చిరంజీవి, బాలకృష్ణ 100 సినిమాలు పూర్తిచేశారు. వెంకటేష్ కూడా ఇదేబాటలో ఉన్నాడు. తన 100వ సినిమా విజువల్ వండర్ గా ఉండి ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉండాలనేది కింగ్ ఆలోచనగా ఉంది. అంతకుముందు అనేక దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయికానీ వారెవరూ ఖరారు కాలేదు. తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ పేరు తెరపైకి వచ్చింది. తమిళంలో నితం ఓరువానం అనే సినిమా చేశారు. అది తెలుగులో ఆకాశం పేరుతో విడుదలైంది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ కథను తెరపై చూపించిన విధానం మాత్రం నాగార్జునకు బాగా నచ్చింది.

కథకు ఓకే చెప్పిన నాగార్జున
కార్తీక్ నాగార్జున కోసం ఓ అదిరిపోయే సబ్జెక్ట్ తో కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నాగార్జునకు కూడా కథ నచ్చి 100వ సినిమా బాధ్యతలు అతనికి అప్పగించినట్లు సమాచారం. కార్తీక్ కు ముందు పూరీ జగన్నాథ్, బెజవాడ ప్రసన్నకుమార్, నవీన్, మోహన్ రాజా తదితరుల పేర్లు వినిపించాయికానీ చివరకు కార్తీక్ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో సోలో హీరోగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాలనే లక్ష్యంతో నాగార్జున ఉన్నారు. ఆయన ఈ రికార్డును అందుకుంటారా? లేదా? అనేది చూడాలి మరి.












Click it and Unblock the Notifications