అదరగొట్టు.. విజయ్ పాటతో త్రిష పోస్టు వైరల్.. కౌంటింగ్ వేళ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారాయి. ఏప్రిల్ 23 న రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమిళనాడులో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఈసారి అందరిచూపూ దళపతి విజయ్ పైనే ఉంది. టీవీకే పార్టీ పెట్టి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన విజయ్ కు యువత, నిరుద్యోగులు, మహిళలు బ్రహ్మరథం పట్టినట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ టీవీకే పార్టీ ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని యాక్సెస్ మై ఇండియా సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. అలాగే డీఎంకే పార్టీకి 92 నుంచి 110 స్థానాలు దక్కుతాయని.. ఇక అన్నాడీఎంకే బీజేపీ కూటమికి 22 నుంచి 32 సీట్లు రావొచ్చని పేర్కొంది. దాంతో విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విజయ్ సీఎం అవుతారని.. ఎన్నికల్లో విజయం టీవీకే పార్టీదేనని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు విజయ్- త్రిష ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో విజయ్- త్రిష కలిసి ఒకే కారులో చెన్నైలోని ఓ వివాహానికి హాజరుకావడంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఇక ఎన్నికల రోజున ఓటు వేసిన అనంతరం త్రిష ఆ విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు విజయ్- త్రిష కాంబోలో వచ్చిన గిల్లీ సినిమా పాటను జత చేశారు. దాంతో ఆ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే తాజాగా మరోసారి గిల్లీ సినిమాలోని అప్పడి పోడు సాంగ్ ను పోస్టు చేశారు త్రిష. ఓ స్కూల్ ఈవెంట్ లో పిల్లలు ఈ పాటకు డ్యాన్స్ వేస్తున్న వీడియోను ఆమె తన స్టేటస్ గా పెట్టుకున్నారు. పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక తమిళనాడులో మే 4 న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు త్రిష పుట్టినరోజు కూడా కావడం విశేషం. దాంతో తమిళనాడు ఎన్నికల్లో గెలిచి విజయ్.. త్రిషకు గిఫ్ట్ ఇస్తాడని సామాజిక మాధ్యమాల్లో పలువురు కామెంట్స్ పెడుతున్నారు.












Click it and Unblock the Notifications