ఓటీటీలోకి రూ.260 కోట్ల సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రూ.260 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా సూర్య కెరీర్లో మరో సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటించింది.
కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, జీవితానికి సంబంధించిన అంశాలను కమర్షియల్ అంశాలతో మేళవించి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఇటీవల విజయవంతంగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సూపర్ హిట్ మూవీ నేడు(సెప్టెంబర్ 11) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వేదికగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అలరించిన ఈ ఫ్యామిలీ డ్రామా.. ఓటీటీలో ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మాస్ యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సూర్య.. ఈ సారి ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. సున్నితమైన భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, పాత్రల మధ్య అనుబంధాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లను సాధించింది. స్టోరీలోని భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో సినిమాకు మంచి ఆదరణ లభించగా.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

స్టోరీ
40 ఏళ్ల సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు కావడంతో పాటు పెద్ద వ్యాపారవేత్త. అయినా కూడా షూటింగ్లో భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని బంగారు పతకం సాధిస్తాడు. పెళ్లిపై ఆసక్తి లేక సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అతడి తల్లి నిర్మలా దేవి (రాధికా శరత్‌కుమార్) గుండె శస్త్రచికిత్స సమయంలో వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు లేడనే బాధతో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. దాంతో అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఓ బాబును కని ఇంటికి తీసుకొస్తాడు. బాబు అనారోగ్యానికి గురైన సమయంలో కన్నతల్లి అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ సంజయ్ విశ్వనాథ్ అమెరికా వెళ్తాడు. 22 ఏళ్ల మదానకామేశ్వరి అలియాస్ మ్యాడీ (మమితా బైజు) వీరి జీవితంలోకి వస్తుంది. అసలు మ్యాడీ ఎవరు? సంజయ్‌కి పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు? అన్నదే మిగతా కథ.'
ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళం యంగ్ బ్యూటీ మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి గతంలో సార్, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.














Click it and Unblock the Notifications
