Mandaadi Movie Review: సూరి vs సుహాస్.. ‘మండాడి’ సినిమా మెప్పించిందా?
Mandaadi Movie Review: గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ క్రీడలు, మానవ సంబంధాల కలయికతో తెరకెక్కిన తమిళ డ్రామా 'మండాడి' సినిమా. తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఇందులో సుహాస్ విలన్ పాత్రను పోషించగా.. తమిళ నటుడు సూరి కథానాయకుడిగా నటించాడు. పుగళేది మతిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సముద్రతీర గ్రామంలో ఇద్దరి మధ్య సాగే ప్రతీకార పోరాటం ఆధారంగా రూపొందింది. మొదట్లో ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ట్రైలర్ రిలీజ్ అయిన అనంతరం తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగిపోయింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో టాలీవుడ్ లో మండాడి సినిమా బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ
20 ఏళ్ల క్రితం కళింగపట్నం ప్రాంతానికి చెందిన ముత్తుకాళి(సూరి), సట్టపులి(సుహాస్) మంచి స్నేహితులు. సాంప్రదాయ పడవల రేసింగ్లో ఇద్దరూ దిట్టలు. అయితే ఒకానొక సంఘటన వల్ల వారి మధ్య విరోధం ఏర్పడి ఒకరికొకరు శత్రువులుగా మారతారు. ముత్తుకాళి ఆ క్రీడను ఎందుకు వదిలేశాడు? ఆ గ్రామంలో సట్టపులి ఆధిపత్యం ఎలా పెరిగింది? మళ్లీ వారిద్దరూ పడవల పోటీలో ముఖాముఖిగా పోటీ పడేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటనేదే 'మండాడి' కథ.

ప్లస్ పాయింట్లు
సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనశైలిని, వారి సాంప్రదాయ పడవల పోటీని అత్యత వాస్తవికంగా తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. నటుడు సూరి మరోసారి తన పరిణతి చెందిన నటనతో ఆకట్టుకున్నాడు. తక్కువ డైలాగులతో భావోద్వేగాలను పండించిన తీరు మెప్పిస్తుంది. మరోవైపు నటుడు సుహాస్ ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన వాయిస్ మాడ్యులేషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సీన్లకు బలాన్ని తెచ్చాడు. ఫస్టాఫ్‌లో సాగే డ్రామా, ప్రీ-ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లు ఉత్కంఠగా సాగుతాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్లు సినిమాకు మంచి ఊపునిచ్చాయి.
మైనస్ పాయింట్లు
ఫస్టాఫ్ వేగంగా, ఆసక్తికరంగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌కు వచ్చేసరికి స్టోరీలో రొటీన్ ఫార్ములా కనిపించి వేగం తగ్గుతుంది. సూరి, సుహాస్ పాత్రల మధ్య వైరం బలంగా చూపించినప్పటికీ.. గతంలో వారి మధ్య ఉన్న స్నేహం, భావోద్వేగ నేపథ్యాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల కొన్ని సీన్లలో ఎమోషన్ లోపించింది. పడవల పోటీ సీన్లు బాగున్నప్పటికీ.. మరిన్ని ట్విస్టులు ఉంటే ఎపిసోడ్లు ఇంకా ఎంగేజింగ్ గా ఉండేవి. సీనియర్ నటుడు సత్యరాజ్ పాత్రను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు.
సాంకేతిక వర్గం
దర్శకుడు మతిమారన్ పుగలేంది ఓ విభిన్నమైన వాటర్ స్పోర్ట్ నేపథ్యాన్ని ఎంచుకుని మెప్పించే ప్రయత్నం చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సముద్రతీర పోరాట ఘట్టాలకు ప్రాణం పోసింది. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ తీరప్రాంత అందాలను గ్రాండ్ గా చూపించింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా..
'మండాడి' సినిమా సాంప్రదాయ నీటి క్రీడ ఆధారంగా ఈగో, ప్రతీకారాల చుట్టూ సాగే ఓ ఆసక్తికరమైన డ్రామా. విభిన్నమైన కథాంశాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
*రేటింగ్: 2.75/5.












Click it and Unblock the Notifications
