పెళ్లి వద్దు పిల్లల్ని కనండి అంటూ వ్యాఖ్యలు.. వివాదంపై వీకే నరేష్ రియాక్షన్
ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్. మూడో భార్యతో విడాకులు, నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపారు నరేశ్. అయితే ఇంటర్వ్యూలు, సినీ వేదికలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పెళ్లిళ్లు చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని కనాలంటూ యువతకు నరేశ్ ఇచ్చిన సలహాతో సాంప్రదాయవాదులు భగ్గుమన్నారు. బాధ్యతగల సెలబ్రిటీ స్థానంలో ఉండి, ఈ వయసులో పిల్లలకు ఇలాంటి సలహాలు ఇస్తారా అంటూ నరేశ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై వీకే నరేశ్ స్పందించారు.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, వీకే నరేష్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన చిత్రం క్రేజీ కళ్యాణం. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఇప్పటి పరిస్ధితుల్లో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? మీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎలాంటి అంచనాకువ వస్తారని నరేశ్‌ని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్ధితుల్లో పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఓకే.. సహజీవనం కూడా అధికారికంగా ఆమోదం పొందింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెళ్లిళ్లు చేయడం చాలా కష్టంగా మారింది. నా ఉద్దేశం ప్రకారం పెళ్లి చేసుకున్నా, పెళ్లిళ్లు చేసుకోకపోయినా పర్లేదు కానీ పిల్లల్ని మాత్రం కనండి అంటూ నరేశ్ వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదంపై నరేశ్ మాట్లాడుతూ.. పెళ్లి అనే ఒక కార్యక్రమం కాలక్రమంలో మారుతూ వచ్చింది. దానిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది కూడా మారింది. కాలక్రమేణా చాలా మార్పులు జరుగుతాయి. పెళ్లి అనే దానిని ఒక ప్రక్రియగా తీసుకోవడం లేదు. పెళ్లి గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నేను పెళ్లి చేసుకోకుండా పిల్లలకు అలాంటివి చెప్పను.. ఈరోజున పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు అనేది బయట చూస్తూనే ఉన్నాం. సహ జీవనం చేస్తున్నవాళ్లు కూడా పిల్లల్ని కంటున్నారు.. దానికి చట్టబద్ధత కూడా వచ్చేసిందని నరేశ్ చెప్పారు.
పెళ్లి చేసుకున్నా.. సహజీవనం చేస్తున్నా.. పిల్లల్ని కనండి అంటే సృష్టిని ఆపలేము. దానిని కంటిన్యూ చేయాలి. ఇవాళ తమ పాపులేషన్ తగ్గిపోతోందని జపాన్ ఆందోళన చెందుతోంది. అదే కాదు ఎన్నో దేశాలు.. మన భారతదేశం కూడా ఈ లిస్ట్‌లో ఉంది. నేను చాలా సీరియస్‌గా, శాస్త్రీయంగా మాట్లాడాను. కాకపోతే సరదాగా క్రేజీ కళ్యాణం టాపిక్‌లో దానిని చెప్పాను. దాని మీద సోషల్ మీడియాలో కూర్చొని నా పర్సనల్ లైఫ్‌ని బయటికి తీస్తున్నారు అని నరేష్ ఫైర్ అయ్యారు.
నేను స్పష్టంగా చెప్పింది ఒకటే.. పెళ్లిళ్లు చేసుకోండి, సహజీవనంలోనూ పిల్లల్ని కనొచ్చు. భూమిని మీరు ఖాళీ చేయొద్దు.. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ప్రధాన మంత్రులు చెప్పినా అదే చెబుతున్నారు. నేను దానిని సపోర్ట్ చేస్తున్నాను, అందులో వేరే ఉద్దేశం లేదు. సోషల్ మీడియాలో దాని గురించి ఇంత డిస్కషన్ అవుతుందంటే నేనే ఆశ్చర్యపోయా. ఎంత ఖాళీగా ఉంటే ఒక మనిషి దాని గురించి చేసుకుంటాడు. సృష్టి జరగాలి అన్నదే తన వ్యాఖ్యల ముఖ్యోద్దేశమని నరేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
