AP SIR: ఏపీలో ఎస్ఐఆర్ మళ్లీ పొడిగింపు- తాజా షెడ్యూల్ ఇదే..!
ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (AP SIR)ను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఎస్ఐఆర్ లో భాగంగా ఎన్యుమరేషన్ కోసం ఫారాల పంపిణీ పూర్తి చేసి, అందులో పేర్లు, ఇతర వ్యత్యాసాల ఆధారంగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారు తగిన ఆధారాలు సమర్పించి, ఓటర్ల జాబితాలో తమ పేర్లు కొనసాగించుకునేందుకు వీలుగా పరిశీలన జరుగుతోంది. ఈ ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దీంతో మరోసారి ఎస్ఐఆర్ గడువు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
దీని ఆధారంగా ఇవాళ ఎస్ఐఆర్ గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తుది ఓటర్ల జాబితాల ప్రచురణ ఈ నెల 16న జరగాల్సి ఉండగా.. దీన్ని కాస్తా ఈ నెల 30వ తేదీకి పొడిగించారు. దీంతో ఓటర్ల నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాల పరిశీలన కోసం కూడా గడువు పెంచారు. ఈ గడువును ఈ నెల 22వ తేదీ వరకూ పొడిగించారు. ఆలోపు ఇంకా తగిన పత్రాలు సమర్పించని ఓటర్లు.. వాటిని బీఎల్వోల ద్వారా ఈఆర్వోలకు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం వారిని ఓటర్ల జాబితాలో కొనసాగించాలా వద్దా అనే దానిపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకుంటారు.

ఈ మేరకు ఎన్నికల అధికారులు కింది స్దాయిలో సిబ్బందికి సమాచారం అందించి ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని, వారు సమర్పించే పత్రాల ఆధారంగా ఓటర్ల జాబితాలో కొనసాగింపుపై నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల అధికారులు ఓటర్ల అభ్యంతరాల పరిశీలన ఈ నెల 22వ తేదీ వరకూ కొనసాగించబోతున్నారు. అనంతరం ఈ నెల 30 తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. ఇప్పటికే తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు కూడా ఎన్నికల కమిషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో కూడా తొలగించిన ఓటర్లు తమ పేర్లను తిరిగి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
