• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సినీ యాక్టర్ల కళా 'పోసణ'

By కె. నిశాంత్
|

Roja
తెలుగు సినీరంగంలో దమ్మున్న హీరోలు లేరని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటే చాలా మందికి రోషం పొడుచుకొచ్చింది. అమీర్ ఖాన్ లాంటి హీరోలు తెలుగులో లేరని ఆయన స్పష్టంగానే చెప్పారు. ఆయనపై దుమ్మెత్తిపోశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాటల్లోని వాస్తవంతో ఎవరికీ పని లేదు. మమ్మల్ని అనడం తప్పమనే ఒక ఆధిపత్య ధోరణి భరద్వాజపై మండిపడడంలో వ్యక్తమైంది. అంటే, ప్రజా ప్రయోజం కోసం ఆలోచించే హీరోలు మన తెలుగులో లేరని అన్నందుకు వారికి కోపం వచ్చింది. సినిమా వ్యాపారమనే విషయం అందరికీ తెలిసిందే. ప్రయోజనాత్మక సినిమా తీస్తే నష్టం వస్తుందని, అందుకే తీయడం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మాత్రం తాము కళాకారులమని, సినిమా కళ అని చెప్పుకుంటారు. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రదర్శిస్తూ సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న మోహన్ బాబు, చిరంజీవి అదే మాట అంటున్నారు. రాజకీయాలకు, సినిమాలకు సంబంధం లేదని, తెలంగాణవాదులు తమ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడం సరి కాదని వారు వాదిస్తున్నారు. వారికి కోస్తాంధ్ర రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారు.

సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడడానికి దివంగత ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సహాయం చేశాడు. హైదరాబాదులోని విలువైన భూములను వారికి చాలా చౌకగా ప్రభుత్వాలు అప్పగించాయి. అలాంటప్పుడు వారికి సామాజిక బాధ్యత ఏ కొంచమైనా ఉండాల్సిన అవసరం లేదా. కమర్షియల్ గా హిట్టయిన సినిమా ద్వారా వచ్చిన లాభం నుంచి కొంత తీసి ప్రయోజనాత్మక సినిమా తీయడం ద్వారా తమ సామాజిక బాధ్యతను నెరవేర్చ వచ్చు కదా. ప్రభుత్వం సినీ పరిశ్రమకు మేలు చేస్తున్నప్పుడు అందుకు ప్రతిగానైనా సమాజం కోసం కొంత చేయాలనే ఆలోచన రాకపోవడం వారి లాభాపేక్షతో కూడిన వ్యాపార దృష్టిని పట్టిస్తుందనడంలో సందేహం లేదు.

ఇక, తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ తమ సినిమాలను అడ్డుకోవడం తప్పని చెప్పే హక్కు సినీ ప్రముఖులకు లేదు. సినిమా, ఆ మాటకొస్తే అది కూడా రాజకీయాలకు అతీతంగా ఉండదు. కళకు కూడా రాజకీయం ఉంటుంది. అందువల్ల సినిమా ఎవరి ప్రయోజనాల కోసం వస్తుందనే ఆలోచన చేయాల్సి అవసరం ఉంటుంది. ఆధిపత్య, పాలకవర్గ ప్రయోజనాలను ప్రతిబింబించే సినిమాలు మాత్రమే తెలుగులో వస్తున్నాయి. ఆ రీత్యా అవి ప్రజల పక్షాన ఉండే అవకాశం లేదు. ఆ విషయం తెలిసే తెలంగాణ ప్రజలు వాటిని చూస్తున్నారు. కోస్తాంధ్ర ఆధిపత్య రాజకీయాలకు వత్తుసు పలుకుతున్న సినిమాలను తీస్తూ, తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న సినీ నటుల సినిమాలను చూడకూడదనే నియమం పెట్టుకోవడం తెలంగాణ ప్రజల అవసరంగా నేడు మారింది. సినిమా రాజకీయాల్లో భాగం కాదనుకుంటే సినీ ప్రముఖలు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు.

మరో విషయం - తెలంగాణ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారనే కనీస ఆలోచన కూడా వారికి రాకపోవడం కళా ప్రపంచానికి అవమానంగానే భావించాలి. అంత భావ దారిద్ర్యం ఉంది కాబట్టే తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ కీర్తి రావడం లేదని భావించడంలో తప్పు లేదు. ఈ విషయంలో నటి రోజా కాస్తా మేలు. తెలంగాణనే కాకుండా రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు వెనకపడి ఉన్నాయని, ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి కోసం ప్రయత్నించి కలిసి ఉందామని ఆమె కాస్తా ఆలోచనతో కూడిన ప్రతిపాదన చేస్తోంది. రాజకీయాలను కూడా శాసిస్తానని ముందుకు వచ్చిన చిరంజీవికి గానీ, కొన్నాళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోహన్ బాబుకు గానీ ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. అయితే ప్రత్యేక ప్యాకేజీల దశ తెలంగాణ విషయంలో ఎప్పుడో దాటి పోయింది. చాలా కాలం పాటు సిపిఐ ఆ ప్రత్యేక ప్యాకేజీ కోసం డిమాండ్ చేసింది. ఆందోళనలు కూడా చేసింది. పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, సుప్రీంకోర్టు, 610 జీవో వంటి పలు హామీలు తెలంగాణ విషయంలో కంటి తుడుపు చర్యగానే మిగిలాయి. ఏవీ అమలు కాలేదు. వరుసగా వాటిని కోస్తాంధ్ర పాలకవర్గాలు నీరు గారుస్తూ వచ్చాయి. ఈ స్థితిలోనే తెలంగాణ ప్రజలు విడిపోదామని అనుకుంటున్నారు. తమకు వేరే రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించి, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చే కనీస ఆలోచన కూడా చేయకుండా కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పినంత మాత్రాన లాభం ఏం ఉంటుంది. అలా కలిసి ఉండడం వల్ల తెలంగాణ ప్రజలు లాభపడే కన్నా నష్టపోయేదే ఎక్కువ ఉంటుంది. అందువల్ల తమ లాభం కోసం తెలంగాణ ప్రజలు నష్టపోవాలని, తాము కళా పోసణ చేస్తున్నాం కాబట్టి తమ మాట వినాలని చెప్పడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. తమ పక్కన నిలబడనంత వరకు వారు తీసే సినిమాలను చూడాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X