కోదండరామ్ వద్ద జవాబు ఉందా?

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ అదే వాదనను ముందుకు తెచ్చారు. విద్యాసంస్థలను మూసేయడం వల్ల దళితులే ఎక్కువగా నష్టపోతారని ఆయన విమర్శలు చేశారు. ఆయన తీవ్రంగానే కోదండరామ్, ఇతర తెలంగాణ ఉద్యమ నేతలపై దండెత్తారు. అదే విధంగా ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్ కూడా కోదండరామ్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కోదండరామ్ నేపథ్యం గురించి కూడా ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలను మూసేయడం వల్ల దళితులు, బలహీనవర్గాల పిల్లలు నష్టపోతారంటునే సామ్రాజ్యవాద దేశం అమెరికాలో వాళ్ల పిల్లలు ఉంటారంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. సామ్రాజ్యవాద దేశమని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా కోదండరామ్ కమ్యూనిస్టు నేపథ్యాన్ని శైలజానాథ్ ప్రస్తావించారు.
నిజానికి, తెలంగాణలోని అగ్ర వర్ణాల పిల్లలు ఎంఎ, ఎమ్మెస్సీ వంటి విశ్వవిద్యాలయ చదువులకు చాలా వరకు దూరమయ్యారు. పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు మాత్రమే దళిత, బహుజనుల పిల్లలతో ఆ చదువులు చదువుతున్నారు. సంపన్న అగ్రవర్ణాల పిల్లలు సాంకేతిక విద్యలకు వెళ్తూ ప్రైవేట్ ఉద్యోగాల పోటీలో ముందుకు పోతున్నారు. సీమాంధ్రకు చెందిన శైలజానాథ్ గానీ తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ గానీ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. అయితే, ఆ వాస్తవం పాక్షికమైందేనని చెప్పాలి. ఇప్పటికీ స్థానికంగానే ఉంటూ స్థానిక విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బలహీన, దళిత వర్గాల పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరమనే విషయాన్ని గుర్తిస్తే ఆ వాస్తవం కాస్తానైనా సంపూర్ణం కాదు, గానీ విస్తృత వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో దళితులు, బలహీన వర్గాల పిల్లలు ఎక్కువగా ఉన్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు అగ్రభాగాన ఉండడానికి తమ ప్రయోజానాలను సాధించుకోవాలనే ఆకాంక్షనే అని తెలంగాణ మేధావుల వాదన. ఇంకా చెప్పాలంటే, దళిత, బలహీన వర్గాల విద్యార్థుల ఆకాంక్ష సాధనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, కోదండరామ్ నలిగిపోతున్నారు. ఉద్యమంలో వెనక్కి తగ్గితే వారు ఎదుర్కునే అవమానం, వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది. ముందుకు సాగుతుండడం వల్ల సంభవించే ప్రమాదాలపై ఆందోళన ఉంది. శైలజానాథ్, మందకృష్ణ మాదిగ వేసిన ప్రశ్నలకు కోదండరామ్ సమాధానం చెప్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications