దేశీయ బ్యాంకులకు కార్పోరేట్ గండం!

Papa Rao D
2008లో అమెరికాలో ప్రపంచ ఆర్థిక మాంద్యానికి బీజాలు పడిన విషయం తెలిసిందె. కాగా, నాడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ పెను ఆర్థిక కుదుపును తట్టుకుని నిలబడ గలిగింది. దీనికి ఒక ప్రధాన కారణంగా, మన దేశీయ బ్యాంకింగ్ రంగం సమర్థతా, పటిష్టతా ఉన్నాయి. 2009లో దేశ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ, నాటి మన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ; మన బ్యాంకింగ్ రంగ తాలూకు బాధ్యతాయుత తీరు వలననే మనం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలోనూ తీవ్ర ఒడిదుడుకులకు లోను కాలేదని పేర్కొన్నారు.

అయితే; 2009కి-నేటికీ నడుమన, పరిస్థితులు వేగంగా, భారీగా మారిపోయాయి. నేడు మనం, మనదేశ బ్యాంకింగ్ రంగం అమెరికా తరహా (2008) సబ్ ప్రైమ్ సంక్షోభం అంచున వుందా? అని ప్రశ్నించుకునే పరిస్థితి ఉంది. నేడు మన దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల తాలూకు మొండి బకాయిలు పెరిగిపోయాయి. సుమారు 2 డజన్లపైన మన జాతీయ బ్యాంకులు -తామిచ్చిన రుణాల తాలూకు మొత్తాలు తిరిగి వసూలు కాక, తీవ్ర ఆర్థిక ఇక్కట్లలో పడిపోయి ఉన్నాయి. కేవలం 2012 నుంచీ 2013 వరకూ, అంటే ఒక్క సంవత్సరం వ్యవధిలోనే, 40 దేశీయ బ్యాంకుల తాలూకు, మొండి బకాయిలు 43శాతం మేరన పెరిగిపోయాయి. 2009 ఆర్థిక సంవత్సరం చివరి దశలో కేవలం 12,190 కోట్ల రూపాయలుగా ఉన్న బ్యాంకుల -మొండి బకాయిలూ, రీస్ట్రక్చర్ చేసిన ఆస్తుల మొత్తం -2013 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.36 లక్షల కోట్లకు చేరింది.

ఇక; పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలూ, వంటి వాటి మొత్తం విలువ-ఆయా బ్యాంకుల మొత్తం నికర విలువ కంటే అధిక శాతంగా ఉండడం ఆందోళనకరం. ఉదాహరణకు, 2014 ఆర్థిక సంవత్సరం, తొలి త్రైమాసిక కాలంలో, కెనరా బ్యాంకులో ఇది 101 శాతంగానూ, ఐడిబిఐలో 109 శాతంగానూ ఉంది. ఇక, మొత్తం జాతీయం చేసిన బ్యాంకులకు-ఇది సగటున 96 శాతం పైబడి ఉంది. మొత్తంగా, ఇది ఆందోళనకర పరిణామం. దేశీయ ఆర్థిక వ్యవస్థకు రానున్న పెను ముప్పుకు ఇది ఒక తార్కాణంగా ఉంది.

మరి, ఈ దుస్థితికి మూలం ఏమిటి? కారణాలు ఎక్కడ ఉన్నాయి. దీనంతటికీ మూలాలు ప్రధానంగా మన దేశీయ కార్పొరేట్ రంగం తాలూకు నిర్వాకాలలోనే ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు మన దేశీయ బ్యాంకులకు రుణపడి ఉన్న వేలాది కోట్ల రూపాయల మొత్తం నేడు మొండి బకాయీగా తయారయ్యింది. ఇక, వివిధ రంగాల వారీగా చూస్తే ప్రధానంగా విద్యుత్, ఇనుము, ఉక్కు రంగ పరిశ్రమలు, మౌలిక రంగ పరిశ్రమల ఈ మొండి బకాయిలలో అధిక శాతంగా ఉంది. ఉదాహరణకు, విద్యుత్ రంగంలో 2013 ఆర్థక సంవత్సరం చివరి నాటికి, 18,450 కోట్ల మేరన బకాయి పడ్డ 18 కార్పొరేట్ రుణ రీస్ట్రక్చరింగ్‌లు ఉన్నాయి. ఇనుము, ఉక్కు రంగంలో ఇదే కాలం నాటికి 53వేల కోట్ల మేరన బకాయి పడ్డ 59 మేరన కార్పొరేట్ రుణ రీస్ట్రక్చరింగ్ లు ఉన్నాయి. ఇక, మౌలిక వసతుల రంగంలో ఇదే కాలం నాటికి, 20వేల కోట్ల రూపాయల పైబడిన సుమారు 20 రుణ రీస్ట్రక్చరింగ్‌లు ఉన్నాయి. ఇదీ, విషయం.

దేశీయ కార్పొరేట్ రంగం సాగించిన ఈ నిర్వాకం తాలూకు ప్రభావం, నేడు మన జాతీయ బ్యాంకుల మనుగడకు ముప్పుగా పరిణమించింది. కానీ మరో పక్కన కార్పొరేట్ సంస్థలలోని అనేకం నేడు దేశీయ బిలియనీర్ల సంఖ్యను పెంచడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ప్రపంచ వ్యాప్తంగానూ, మనదేశంలోనూ-పేదరికం పెరిగిపోతూ, మధ్య తరగతి వర్గ స్థితి గతులు దిగజారిపోయాయి. కానీ, అదేకాలంలో దేశంలోని ధనవంతుల సంఖ్య మాత్రం పెరిగింది. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మనకున్న స్థానాల సంఖ్య పెరిగింది. కాగా, ఇదే బిలియనీర్ల తయారీకి పునాదిగా ఉన్న మన కార్పొరేట్ రంగంలోని అనేక సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి తాము తీసుకున్న రుణ బకాయీలను చెల్లించ ‘లేకపోతున్నాయి!‘. మరో పక్కన, ఈ కార్పొరేట్ రంగ మారాజుల నేతృత్వంలోని మీడియా మాత్రం-మన దేశీయ ఆర్థిక సమస్యలు అన్నింటికీ మూలాలను వేరే చోటన చూస్తోంది. దేశీయ జన సామాన్యానికి ఇచ్చే-ఎరువులు, ఆహారం, ఇంధన సబ్సిడీలే-మన ఆర్థిక ఇక్కట్లకు కారణమని, ఈ మీడియా మన చెవిలో గూడుకట్టుకుని హోరు పెడుతోంది. ఈ కార్పొరేట్ రంగం తానే స్వయాన లక్షల కోట్ల మేరన దేశీయ బ్యాంకులకు ఎగనామం పెట్టిన వైనాన్ని మాత్రం ఈ మీడియా ప్రస్తావించదు.

ఇక, ఇదంతా చాలాదన్నట్లు మన కార్పొరేట్లు- సాలీన 5లక్షల కోట్ల రూపాయల మేరన, మన ప్రభుత్వం నుంచి- కార్పొరేట్ పన్నులూ, ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల రూపంలో రాయితీలను పొందుతున్నాయి. 2005-06, 2010-11(5 సంవత్సరాల కాలం)లో మన ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు సుమారు 25 లక్షల కోట్ల రూపాయల రాయితీలను ఈ విధంగా పొందాయి. ఇక, అనంతర కాలంలో, నేటికీ ఈ రాయితీల జల్లు కార్పొరేట్లపై కురుస్తూనే ఉంది. ఇదంతా, మనం దేశ ఖజానాకు నష్టం కలిగించేదే. కానీ, 2008లో 60వేల కోట్ల రూపాయల మేరన రైతుల రుణ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేస్తే- దాని గురించి, కార్పొరేట్ మీడియా నానాయాగీ చేసింది. అదీ కథ. కర్ర ఉన్నవాడిదే బర్రె కథ. బలవంతుడిదీ, ధనవంతుడిదే అధికారం, పెత్తనం అనడానికి వీటికంటే తార్కాణాలేమి కావాలి. నీతికి, న్యాయానికి కూడా వర్గం, ధనిక-పేద వ్యత్యాసాలు, తేడాలు వర్తిస్తాయానడానికి ఇవి చిన్న మచ్చుతునకలు మాత్రమే. నిజానికి మనం జీవిస్తోంది తలకిందులు ప్రపంచం. ‘‘చట్టం ముందు అందరూ సమానమే, కానీ కొందరు మరింత ‘ఎక్కువ' సమానం'' అని మనం భావించడం బహుశా తప్పుకాదేమో!!!

-డి పాపారావు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+