పేదల గుండెలుదోచిన గజదొంగ - వీరప్పన్
గుజరాత్ ఒక శాపగ్రస్త రాష్ట్రం. తొలుత భూకంపం. ఆ తర్వాత మారణకాండ. తొలిది ప్రకృతి కన్నెర చేస్తే జరిగిన గాయమైతే, రెండోది స్వార్థ రాజకీయాల మారణహోమ ఫలితం. గోద్రా సంఘటన అనంతరం గుజరాత్ అట్టుడికిపోయింది. ఎంతో మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బతుకులీడుస్తున్నారు. ఒక రకంగా స్వదేశంలో, అదీ స్వరాష్ట్రంలో కాందిశీకుల్లా బతుకుతున్నారు. వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ స్థితిలో మరో గాయానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) రంగం సిద్ధం చేసింది. ఎన్నికలు నిర్వహించి వెంటనే అధికార పీఠం అధిష్ఠించాలనే రాజకీయ ప్రయత్నాలకు బిజెపి శ్రీకారం చుట్టింది. అయితే ప్రతిపక్షాలు తక్షణ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. బిజెపితో సహా ఎన్‌డిఎ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా తక్షణ ఎన్నికలను వ్యతిరేకిస్తోంది.
నరేంద్ర మోడి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు సిఫార్సు చేయడం బిజెపి రాజకీయ ఎత్తుగడంలో భాగమే. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ నిబంధనను అమలు చేయాల్సిన అగత్యంలో బిజెపి ప్రభుత్వం పడేసింది. నరేంద్ర మోడి ప్రభుత్వం రద్దయిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని బిజెపి పట్టుబడుతోంది. కాశ్మీర్‌ను గుజరాత్‌ను ఒకటి చేసి మాట్లాడుతోంది.
ఈ స్థితిలో ఎన్నికల కమీషన్ బృందాలు గుజరాత్‌లో పర్యటించాల్సి వచ్చింది. ఈ బృందాల పర్యటన ఫలితాలు తాము ఆశించిన ఉద్దేశాలకు భిన్నంగా ఉండడం బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు. దీంతో ప్రధాన ఎన్నికల కమీషనర్ జె.ఎం. లింగ్డోను బిజెపి నేతలు టార్గెట్ చేశారు. గుజరాత్ పునరావాస శిబిరాలను సందర్శించిన ఏ మానవ మాత్రుడికైనా అక్కడి ఘోరం ఎంతటిదో, ఎంత అమానుషమైందో, బాధితులను ఆ పునరావాస కేంద్రాల్లోనే ఉంచేసి ఎన్నికలు నిర్వహించడం ఇంకెంతో దారుణమైందో ఇట్లే అర్థమైపోతుంది. గోద్రా అనంతర సంఘటనల తర్వాత గుజరాత్ వెళ్లినవారెవరైనా సరే, అక్కడి పరిస్థితులకు చలించిపోకుండా, అక్కడి ప్రభుత్వంపై, అధికార యంత్రాంగంపై ఆగ్రహం వెళ్లగక్కకుండా ఉండలేరనేది సత్యం. ఎన్నికలను నిర్వహించడమనే ప్రధాన బాధ్యతను నెరవేర్చాల్సిన లింగ్డో కూడా ఒక మనిషిగా కొన్ని వ్యాఖ్యలు చేయకుండా వుండలేకపోయారు. దానికి బిజెపి నిప్పులు కక్కుతోంది. ఎన్నిలక నిర్వహణకు తగిన పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది అంచనా వేసేది కేంద్ర హోం శాఖనే అని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ అన్నారు. ఇదే వాదనను బిజెపి ముందుకు తెస్తోంది. ఓటర్ల జాబితాను సరిదిద్దడం, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడమే లింగ్డో చేయాల్సిన పని ఆయనకు లక్ష్మణ రేఖలు గీస్తోంది. అయితే, ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేవనేది తెలిసిపోతూనే ఉంది. లింగ్డో మాట మాట్లాడకుండా తమ కోరిక మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే బిజెపి నేతలకు ఏ బాధా ఉండేది కాదు.
బిజెపి వాదన న్యాయమైంది కాదని రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గుజరాత్ పర్యటన కూడా తేలుస్తూనే ఉంది. నిజానికి, రాష్ట్రపతి గుజరాత్ పర్యటన చేయడం బిజెపిని ఇరకాటంలో పెట్టినట్లయింది. కలామ్ అక్కడి పరిస్థితి గురించి ఒక్క మాట మాట్లాడకపోయినా అక్కడి బాధితుల అభిప్రాయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కలామ్ పర్యటన బాధితుల అభిప్రాయాలు వెలుగు చూడడానికి పనికి వచ్చింది. ఈ అభిప్రాయాలను బట్టి చూసినా గుజరాత్‌లో ఎన్నికల నిర్వహణకు సరైన వాతావరణం లేదనేది అర్థమవుతూనే ఉంది. ఈ స్థితిలో విపక్షాల నాయకులే కాదు, మాజీ ప్రధాని వి.పి. సింగ్ లాంటివారు కూడా గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని అభిప్రాయపడుతున్నారు. ఇందరి మాటను కాదని బిజెపి ఎన్నికలకే మొగ్గు చూపుతోంది. లింగ్డోపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే లింగ్డో ఆ విధంగా వ్యవహరిస్తున్నారని దూషిస్తోంది.
గుజరాత్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే బిజెపి అధికారంలోకి రావడం బహుశా ఖాయం కావచ్చు. ఈ విజయాన్ని సొంతం చేసుకోవడానికే బిజెపి రాజకీయ నాటకమంతా ఆడుతోంది. అయితే, ఇది గుజరాత్‌కే పరిమితమవుతుందా? గుజరాత్ ఎన్నికలు బహుశా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేయడానికి ప్రయోగం కావచ్చు. ప్రయోగ దశలోనే దీన్ని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యమనేది ఒక వర్గం నాటకంగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.












Click it and Unblock the Notifications
