చార్లెస్: సికింద్రాబాద్ నుంచి ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా’
ముంబై: తక్కువ ఖర్చుతో పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రణాళికలు రూపొందించడమేగాక, దేశవిదేశాల్లో అద్భుతమైన కట్టడాలకు రూపకల్పన చేసి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా(84 ) ముంబైలో కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆధునిక భారత రూపశిల్పిగా పేరుగాంచిన చార్లెస్ కొరియో 1930 సెప్టెంబర్ 1న సికింద్రాబాద్‌లో జన్మించారు. దేశంలోని ప్రముఖ కట్టడాలతో పాటు పలు కీలక స్థానాల్లో ఆయన సేవలందించారు. అహ్మదాబాద్‌లోని మహాత్మా గాంధీ సమాధితో పాటు మధ్యప్రదేశ్ శాసనసభ భవనానికి కొరియానే రూపకల్పన చేశారు.
1970లో సముద్రతీరం నుంచి ముంబయి వరకు నూతనంగా నిర్మించిన 'నేవీ ముంబై' పట్టణానికి ముఖ్య వాస్తుశిల్పిగా సేవలందించారు. అనంతరం జాతీయ పట్టణాభివృద్ధి సంస్థకు మొదటి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో మార్గదర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
1972లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసిన ప్రభుత్వం.. 2006లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. సికింద్రాబాద్‌లో జన్మించిన కొరియా.. ముంబైలోని సెయింట్ జేవియర్ కళాశాలలో విద్యాభాస్యం చేశారు.
అనంతరం మిచిగన్, ప్రతిష్ఠాత్మక మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టాను పొందారు. ముంబైలోని గ్రామీణ రూపకల్పన పరిశోధనా కేంద్రానికి కొరియానే వ్యవస్థాపకులు.
కాగా, కొరియా అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు తెలిపారు. చార్లెస్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఇతర ప్రముఖులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన కట్టడాలు, భవనాల నిర్మాణం వెనుక ఆయన ప్రతిభ, సౌందర్య పిపాస కనిపిస్తుందని మోడీ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications