వేదమంత్రాలతో ఒక్కటైన ముస్లిం జంట!
తూర్పుగోదావరి: హిందూ సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగిన ఓ ముస్లిం తన కుమార్తె వివాహాన్ని హైందవ సంప్రదాయంలో జరిపించాడు. ఆ ఇంట 'మాంగల్యం తంతునానేన..' వేద మంత్రాలు ప్రతిధ్వనించాయి. పెళ్లి కుమారుడి తరపు వారిని, కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి జరిపించడం విశేషం.
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలేనికి చెందిన వ్యాపారి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షేక్ మగ్ధూమ్ (రఫీ), షేక్ తహేరా దంపతులు శుక్రవారం ఉదయం తన నివాసం వద్ద కుమార్తె రేష్మకు ఏలూరుకు చెందిన అబ్ధూల్ రహీమ్‌తో వివాహం జరిపించారు.
కాగా, చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాలంటే రఫీకి మిక్కిలి మక్కువ. వేదమంత్రాలపై అపార నమ్మకం. ఈ విశ్వాసమే తన కుమార్తె రేష్మీ, వరుడు అబ్దుల్ రహీమ్‌ల వివాహం హిందూ సంప్రదాయంలో నిర్వహించేలా చేసింది.
ఇందుకు పెళ్లికుమారుడి తరఫు వారిని, బంధువులనూ ఒప్పించాడు.
పెళ్లి సందర్భంగా శుక్రవారం ఉదయం రఫీ ఇంట వేద పండితులు ప్రతి మంత్రానికీ అర్థాన్ని వివరిస్తూ వివాహం జరిపించారు. శుభలేఖనూ హిందూ సంప్రదాయూనుసారం 'జానక్యాః..' అనే శ్లోకం, హిందూ దేవతామూర్తుల బొమ్మలతో ముద్రించడం, విందును కూడా పూర్తిగా శాకాహారంతో ఏర్పాటు చేయడం విశేషం.

కాగా, బంధువులతోపాటు స్థానికులు పెళ్లితంతును చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ముస్లిం ఆచారాలతో జరగాల్సిన పెళ్లి పూర్తిగా హిందూ సంప్రదాయం, ఆచారాలతో జరగడమే. భాజాభజంత్రీలు, పట్టువస్త్రాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, మాంగల్యధారణ వంటి తంతుతో వివాహం వైభవంగా జరిపించారు.
వేద మంత్రాలంటే తమకు ఎంతో గౌరవమని, ఆ విషయాన్ని పెళ్లి కుమారుడి తల్లిదండ్రులకు వివరించడంతో వారూ సముఖత వ్యక్తం చేయడంతో హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిపించినట్లు వధువు తండ్రి షేక్ మగ్ధూమ్ వివరించారు.
ఈ పెళ్లి సందర్భంగా ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయిన పది మంది యువతులను ఎంపిక చేసి భవిష్యత్తులో వారి పెళ్లిళ్లకు ఉపయోగపడేలా ఒక్కొక్కరి పేరిట రూ. 10 వేలు చొప్పున ఫిక్సిడ్ డిపాజిట్ చేయించి ఆ బాండ్లను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతులు మీదుగా వారికి అందించారు.












Click it and Unblock the Notifications