జూ. ఎన్టీఆర్ కు లోకేష్ చెక్

లోకేష్ ఆదివారంనాడు తన తండ్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన నాయకులకు సూచించారు. మెల్లగా ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికను కూడా చంద్రబాబు లోకేష్ తో కలిసి పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ నాయకులకు గానీ, ఇతరులకు గానీ తెలియకుండా తండ్రీకొడుకులు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసి జాబితాను రూపొందించినట్లు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇమేజ్ ను ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే ఉపయోగించుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. పార్టీపై, పార్టీ వ్యవహారాలపై పట్టును మాత్రం లోకేష్ కు సాధించి పెడుతున్నట్లు సమాచారం. ముందు చూపుతోనే ఆయన ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య పోటీ ప్రజ్వరిల్లినట్లేనని కూడా ప్రచారం జరుగుతోంది. కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వం కోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ ప్రసంగాల తీరు, హావభావ విన్యాసం ఎన్టీ రామారావును తలపింపజేస్తుండడం ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడానికి కుటుంబమంతా ఏకమైనా కావచ్చునని, ఈ స్థితిలో లోకేష్ ను ముందు పెట్టాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. స్వయానా అల్లుడు కావడంతో బాలకృష్ణ కూడా లోకేష్ నాయకత్వాన్ని వ్యతిరేకించపోవచ్చునని చెబుతున్నారు. ఏమైనా, కాంగ్రెసును ఓడించడానికి బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపడం ద్వారా పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి చంద్రబాబు ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications