వారితో జగన్ కు పోలికా?

అయితే, తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రను చూసి ఆయన అనుకూల వర్గాలు సంబరపడి పోతుండగా, వ్యతిరేకులు పెదవి విరుస్తున్నారు. జగన్ యాత్రను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పర్యటనలతోనూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం ఎన్నికల ప్రచారంతోనూ పోలుస్తున్నారు. చిరంజీవి పర్యటనలకు విశేషంగా ప్రజానీకం వచ్చిందని, కానీ ఓట్ల వరకు వచ్చేసరికి చిరంజీవి చతికిల పడ్డారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం ఎగబడ్డారని, కానీ తెలుగుదేశం పార్టీ అక్కడ ఏ మాత్రం ఫలితాలు సాధించలేకపోయిందని, ఎర్రంనాయుడు వంటి దిగ్గజం కూడా ఓటమి పాలయ్యారని వారంటున్నారు. దీన్ని బట్టి పర్యటనలకు వచ్చే ప్రజలంతా ఓటు వేస్తారని అనుకోవడం భ్రమే అవుతుందని వాదిస్తున్నారు.
దివంగత నేత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి పర్యటనలకు, సభలకు కూడా విశేషంగా ప్రజలు వచ్చారు. కానీ, ఓట్ల వరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి వేశారని ఉదహరిస్తున్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు సినీ నటులు కాబట్టి వారిని చూసేందుకు జనం వచ్చారని, లక్ష్మీపార్వతి విషయంలో అప్పటి ప్రత్యేక పరిస్థితి కారణమని అంటున్నారు. జగన్ గ్లామర్ ప్రపంచానికి చెందిన సినీ నటుడు కారని, ఆయన సభలకు వచ్చే జనం ఆయన బలాన్ని పట్టిస్తుందని ఆయన అనుకూల వర్గాలంటున్నాయి. కానీ, పరీక్ష సమయం వస్తే తప్ప ఏదీ తేలదు.












Click it and Unblock the Notifications