బాబు పాదయాత్రలో తొలిరోజు భువనేశ్వరి

పాదయాత్ర చేసేది బాబు ఒక్కరే. కానీ ఆయన వెంట రోజూ పాల్గొనే వారి సంఖ్య కనీసం వెయ్యిదాకా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. తెరవెనుక జరుగుతున్న ఈ ఏర్పాట్లు ఓ మహా యజ్ఞాన్నే తలపిస్తున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మొదలయ్యే ఈ సుదీర్ఘ యాత్ర 117 రోజులు సాగనుంది. ఇందు కోసం పార్టీ నేతలు చాలా ముందుగానే సన్నాహాలు మొదలెట్టారు. ఆయనతో పాటు ఈ యాత్రలో రోజూ వెయ్యిమంది ఉంటారని పార్టీ వర్గాల అంచనా.
అసెంబ్లీ ఎన్నికల ముందు మీకోసం పేరుతో బాబు బస్సుయాత్ర నిర్వహించగా అప్పుడు రోజుకు సగటున 900-1000 మంది ఉండేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా లెక్కలు వేసుకొంటున్నారు. ఇంతమంది రోజూ పడుకోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, వారి ఆహారానికి ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాత్రి బసను వీలైనంత వరకు విశాలంగా ఉండే ఆవరణల్లో పెట్టాలని నిర్ణయించారు. ఈ ఆవరణల్లో భారీ గుడారాలు వేసి ఎన్ని వందల మందైనా అందులో విశ్రమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేలపై పరుపులు వేసి ఎవరైనా వాటిపైనే పడుకొనే ఏర్పాటు చేస్తున్నారు. ఆహారం, తాగునీరు, ఇతర అవసరాల కోసం రెండు మంచినీటి ట్యాంకర్లు నిరంతరం వెంట ఉండేలా చూసుకొంటున్నారు. అల్పాహారం, భోజనం తదితరాల తయారీకి ఒక బృందం పాదయాత్ర చివరి రోజు వరకు వెన్నంటే పర్యటించేలా చూస్తున్నారు. ఈ ఏర్పాట్లలో చంద్రబాబుకు సంబంధించినవి వేరు చేస్తున్నారు. ఆయన తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలుగా అన్ని వసతులున్న ఒక వ్యాన్‌ను సిద్ధం చేస్తున్నారు. అది పూర్తిగా ఆయన పాదయాత్రతో పాటే తిరుగుతూ ఉంటుంది.
ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడానికి చంద్రబాబు కోసం ఒక వంట మనిషిని ఆయన సతీమణి విడిగా పంపిస్తున్నారు. మిగిలిన వారితో పాటు చంద్రబాబు కోసం కూడా ఒక గుడారం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ నిద్రించాలనేది బాబు ఇష్టానికి వదిలేశారు. బాబు వెంట ఉన్నవారందరి అవసరాలనూ పరిగణించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ఫోన్లు చేసి యాత్ర మొదటి నుంచి చివరి వరకూ పాల్గొంటామని అడుగుతున్నారని, తాము ఎవరినీ వద్దనకుండా అందరినీ రమ్మనే చెబుతున్నామని వివరించారు.
దానిని బట్టి కూడా ఏర్పాట్లలో మార్పులు చేర్పులు ఉంటాయంటున్నారు. సాధారణంగా చంద్రబాబు కార్యక్రమాలకు ఆయన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటారు. పార్టీ నేతల ప్రమేయమే అధికంగా ఉంటుంది. కానీ ఈ సారి పాదయాత్ర తొలి రోజు ఆయనతో పాటు భార్య భువనేశ్వరి కూడా పాల్గొంటున్నారు. ఖరారైన కార్యక్రమం ప్రకారం అక్టోబర్ రెండో తేదీ ఉదయం బాబు తన సతీమణితో కలిసి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్, బాపు ఘాట్ సందర్శించి విమానంలో బెంగళూరు వెళ్తారు.
అక్కడ నుంచి సాయంత్రం ఐదు గంటలకు రోడ్డు మార్గంలో హిందూపురం చేరతారు. తొలుత అక్కడ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలిరోజు పాదయాత్ర కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ రోజు రాత్రి హిందూపురం పట్టణంలోని ఒక స్పిన్నింగ్ మిల్లు ఆవరణలో బస చేస్తారు. రెండో రోజు ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు పాదయాత్రను కొనసాగిస్తారు.