జగన్ కేసు: 'ధర్మాన'ను గమనిస్తున్న మంత్రులు

Dharmana Prasad Rao
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంలో ఐదో నిందితుడిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాద రావు మంగళవారం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. సిబిఐ ఛార్జీషీటులో తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు దానిని ఆమోదించలేదు. మరోవైపు ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జగన్ ఆస్తుల కేసులో ఊచలు లెక్కిస్తున్నారు.

దీంతో ఇప్పుడు ధర్మాన భవిష్యత్తు పైన, మిగిలిన నలుగురు మంత్రుల భవిష్యత్తు పైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిఎం రాజీనామా ఆమోదిస్తారా, లేదా, న్యాయస్థానం ఆదేశాలు ఎలా ఉంటాయి, దాని ఆధారంగానే సిఎం నిర్ణయం ఉంటుందా, మోపిదేవిలాగే ధర్మాన అరెస్టు కానున్నారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. వాన్‌పిక్ భూకేటాయింపుల్లో ధర్మాన కుట్రదారు అంటూ సిబిఐ అభియోగాలు మోపింది. ఆ అభియోగ పత్రాన్ని స్వీకరించిన సిబిఐ కోర్టు తమ ఎదుట హాజరు కావాలంటూ ధర్మానను ఆదేశించింది.

కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ధర్మాన న్యాయస్థానంలో తన వాదనలు ఏవిధంగా సాగనున్నాయో వివరించినట్లుగా తెలుస్తోంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జారీ చేసిన 26 జీవోలపై వివరణ కోరుతూ అప్పటి మంత్రులు మోపిదేవి వెంకట రమణారావు, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

వాన్‌పిక్ భూ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి మోపిదేవి జైలు ఊచలు లెక్కిస్తుంటే.. మంత్రి ధర్మాన మంగళవారం కోర్టు గుమ్మం ఎక్కారు. సిబిఐ అభియోగ పత్రంలో తన పేరు ఉండడంతో ఆగస్టు 14న మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సిఎం కిరణ్‌కు ధర్మాన లేఖ అందజేశారు. నాటి నుంచి మంత్రిగా విధులను నిర్వర్తించడం లేదు. సీబీఐ మోపిన అభియోగాలపై వివరణ ఇవ్వాలంటూ ధర్మానను ప్రభుత్వం కోరిన మేరకు శనివారం ధర్మాన వివరణ ఇచ్చారు. మంత్రి పదవికి ధర్మాన రాజీనామా చేసి దాదాపు 40 రోజులు కావస్తున్నా.. సిఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ధర్మాన వివరణను న్యాయ నిపుణులు పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పైగా.. మంత్రి హోదాలో న్యాయస్థానం గుమ్మం ఎక్కితే తప్పేమిటని వ్యాఖ్యానించారు కూడా. తాము జారీ చేసిన ఉత్తర్వులు ఒకదాని వెంట మరొకటిగా తమ మెడకు చుట్టుకోవడంతో మిగిలిన మంత్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిపక్షాలు తమను కళంకితులుగా అభివర్ణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

సిబిఐ ఇప్పటికే మోపిదేవిని అరెస్టు చేయడం, మంత్రి ధర్మాన మంగళవారం సీబీఐ కోర్టుకు హాజరు కానుండడంతో వారిలో ఉత్కంఠ పెరిగింది. ఈ కేసులో సిబిఐ న్యాయస్థానం చేసే వ్యాఖ్యలు అత్యంత కీలకం కానున్నాయి. వాటి ఆధారంగానే ధర్మాన రాజీనామాపై సిఎం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండడంతోపాటు మిగిలిన నలుగురు మంత్రుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆరోపణలు ఎదుర్కొన్న మిగిలిన మంత్రులు ధర్మానపై జరుగుతున్న వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+