అసెంబ్లీ తీర్మానం: లగడపాటి వాదనలో పస ఎంత?

Lagadapati Rajagopal
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు శాసనసభ తీర్మానం అవసరమని, తీర్మానం శాసనసభకు పంచాయతీ ఎన్నికల తర్వాత వస్తుందని, దాన్ని శానససభలో ఓడించి తీరుతామని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తాజాగా కూడా అన్నారు. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అంతకు ముందు రోజే అన్నారు. అసెంబ్లీ తీర్మానం ఎందుకు అవసరం లేదో తెలంగాణకు చెందిన పలువురు నాయకులు ఇప్పటికే విడమరిచి చెప్పారు. అయినా, లగడపాటి రాజగోపాల్ అదే మాట అంటున్నారు.

శానససభ తీర్మానం అవసరం లేకుండా ఓ రాష్ట్ర ఏర్పాటును ఎలా చేయవచ్చునో చూద్దాం...

రాజ్యాంగంలోని అధికరణం 3(1) ప్రకారం సర్వాధికారాలూ కేంద్రానివే. రాష్ట్ర విభజన బిల్లును లేదా తీర్మానాన్ని శాసనసభకు సిఫార్సు చేయాలని మాత్రమే అధికరణం 3(1) చెబుతోంది. మైనారిటీ ప్రాంతాల భవిష్యత్తును మెజారిటీ ప్రాంతాల దయాదాక్షిణ్యాలకు వదిలేయకూడదన్న దూరదృష్టితోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈ నియమాన్ని పెట్టారు. విభజన తీర్మానాన్ని శాసనసభ ముందుగా చేయాలా, బిల్లు తయారయిన తర్వాత చేయాలా అన్న అంశంపై కూడా స్పష్టమైన విధివిధానాలేమీ లేవు.

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఈ కింది పద్దతులను అవలంబించాలి..

1. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖకు పంపాలి. కేంద్ర హోంశాఖ ఒక ముసాయిదా బిల్లును రూపొందించి మళ్లీ కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తుంది.

2. కేంద్ర మంత్రివర్గం ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి దాన్ని నిర్దిష్ట కాలవ్యవధితో రాష్ట్ర శాసనసభకు నివేదిస్తారు. రాష్ట్ర శాసనసభ ఆ బిల్లుకు ఆమోదం తెలిపినా, తిరస్కరించినా నిర్దిష్ట గడువులోపల చేయాలి. శాసనసభ నిర్దిష్ట గడువులోపల తన అభిప్రాయాన్ని తెలియజేయకపోతే, రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంటు ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్ర శాసనసభ ఆమోద, తిరస్కారాలతో సంబంధం లేకుండా కేంద్రం తన నిర్ణయం తాను తీసుకోవచ్చు.

3. బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో దేనిలోనైనా ముందుగా ప్రతిపాదించవచ్చు. సభకు హాజరైన సభ్యుల్లో సాధారణ మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును ఆమోదిస్తే చాలు. ఇలా రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందితే బిల్లు చట్టమవుతుంది.

4. చట్టం కావడంతోనే రెండు రాష్ట్రాలు ఏర్పాటవుతాయి. విభజనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్రం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తుంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఇందులో ఉంటారు. ఆస్తులు, అప్పులు, వనరులు, ఉద్యోగాలు, జలాల పంపిణీని నిర్ణయించడానికి వేర్వేరు కమిటీలను నియమిస్తారు.

ఈ సమయం సరిపోతుందా.?

అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమయం సరిపోతుందా అనేది సమస్య. ప్రభుత్వం చేయదలుచుకుంటే, ముప్పై రోజుల్లో పూర్తి చేయవచ్చు, సాగదీయాలుచుకుంటే ఎన్నిరోజులైనా తీసుకోవచ్చు.

9 డిసెంబరు 2009లో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీ నుంచి రాగానే అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. తీర్మానం ఆమోదం పొందినా, తిరస్కారం పొందినా ఒక ప్రక్రియ పూర్తయి ఉండేది. ఇప్పుడయినా కేంద్రం తల్చుకుంటే శాసనసభను సమావేశపర్చి ఈ తీర్మానంపై అభిప్రాయం కోరడం మూడు రోజుల పని.

కేంద్ర ప్రభుత్వానికి ఇంకా దాదాపు పది నెలల గడువు ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయదలుచుకుంటే ఎన్నికల లోపే అయిపోతుంది. తేలాల్సిందల్లా ఆచరణలో ఇప్పుడు కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖంగా ఉందా, లేదా అనేదే.

శానససభలో విభజనకు తీర్మానం చేస్తే కొత్త రాష్ట్రాల ఏర్పాటు సులభమవుతుంది. రాజకీయ వైరుధ్యాలు లేకుండా సామరస్యపూర్వకంగా పని జరిగిపోతుంది. కేంద్రంపై ఒత్తిడి పెట్టడానికి కొత్త రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నవారికి ఎక్కువ సులభమవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+