తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా పార్టీకి రాజీనామా చేయడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఆమె ఖాళీని పూర్తి చేయడం ఆయనకు కష్టంగా ఉందని అంటున్నారు. రోజా తెలుగు మహిళ అధ్యక్షురాలిగా రాజకీయాల్లో తన ఇమేజ్ ను పెంచుకోవడమే కాకుండా పార్టీ ఇమేజ్ కూడా పెంచారు. ఆమెలాగా ప్రతిపక్షాలను ఎదుర్కోగల మహిళా నేత తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉంటే తప్ప సరైన న్యాయం జరగదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అలా లేని పక్షంలో రోజాకు అది మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పదవిలో ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారిని నియమించే దిశగా కూడా ఆలోచన సాగినట్లు చెబుతున్నారు. అయితే ఆమెపై పార్టీ నాయకత్వానికి పూర్తి నమ్మకం లేదు. క్వార్టర్స్ కేటాయింపు విషయంలో ఆమె విమర్శలు, కారంచేడులో చేటు తెచ్పిన వైనం ఆమెను వివాదాస్పద నేతగా మార్చాయి. ఆమె వల్ల అదనపు కష్టాలు వచ్చే ప్రమాదం లేకపోలేదని చంద్రబాబు సందేహిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో సినీ నటి కవిత పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కవిత రాజకీయాలకు కొత్త కావడం ఆటంకంగా మారుతుందా అనే ఆలోచన సాగుతోంది. అయితే కవిత మాత్రం తాను పార్టీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనని అంటున్నారు. సినిమా నటులైనంత మాత్రాన రాజకీయాలు చేయలేరనేది ఏమీ లేదని ఆమె అంటోంది. ఆ పదవి కోసం ఆమె తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏమైనా రోజా ఖాళీని భర్తీ చేయడం చంద్రబాబుకు కష్టంగానే ఉందని అంటున్నారు.