వ్యాపారాలకు జగన్ విచారణ దెబ్బ?

దీంతో కోఠి, ఆంధ్రా బ్యాంక్, సుల్తాన్ బజార్, బడీచౌడీ, ఇసామియా బజార్ తదితర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారట. ఇటీవల పలువురు ఐపీఎస్‌లను విచారణకు పిలిపించినప్పుడే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దెబ్బకు తమ వ్యాపారాలు సరిగా సాగలేదని వ్యాపారులు వాపోతున్నారట. ఇక... జగన్‌నూ ఇక్కడే ప్రశ్నిస్తే ఏం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. శనివారమే ఇక్కడ పోలీసుల హడావుడి కనిపించింది. సిబిఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేంద్రీయ సదన్‌కు వెళ్లే దారిలో కంచె, బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా అత్యంత కష్టమ్మీద ఐడెంటిటీ కార్డులు చూసి, సెక్యూరిటీ గార్డులను విచారించి లోనికి అనుమతించారు. ఉమెన్స్ కాలేజి నుంచి కోఠికి వెళ్లే దారిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మెయిన్‌రోడ్డు దగ్గరే బారికేడ్లు, ముళ్లకంచె అడ్డుపెట్టడంతో.. లోపలున్న పుస్తకాల దుకాణాలకు వెళ్లేవారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పుస్తకాల కొనుగోళ్లకు జనం విపరీతంగా వస్తున్నారు.
పోలీసులు వారిని అనుమతించకపోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా కార్యాలయ కాంపౌండ్‌లో ఉన్న మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు బయటకు పంపారు. సిబిఐ కార్యలయం ఉన్న భవనంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సుమారు 45కు పైనే ఉన్నాయి. వాటికి వెళ్లే ఉద్యోగులనూ పోలీసులు అడ్డుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన తమను అడ్డుకోవడం ఏంటని పలువురు ఉద్యోగులు ఆగ్రహించారు. ఐడెంటిటీ కార్డులు చూపి కొందరు, మరిచిపోయి వచ్చినవారు అక్కడి సెక్యూరిటీతో చెప్పించుకొని లోపలికి వెళ్లాల్సివచ్చింది. కాగా చంచల్‌గూడ జైలులోనే సిబిఐ అధికారులు జగన్‌ను విచారించనున్నారని తెలియడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications