ఎవరి భుజాలపై ఎవరు?: వైయస్‌పై జగన్ X ఆనం

వైయస్ కారణంగానే ఆనం సోదరులు ఎదిగారని, రాజకీయాల్లో ప్రాధాన్యత కలిగిన వారయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదురుదాడికి దిగుతుండేది. వైయస్ వల్లే తాము ఎదిగామన్న వ్యాఖ్యలతో ఆనం వివేకానంద రెడ్డి విభేదిస్తున్నారు. పైగా తమ చలువ కారణంగానే వైయస్ ఎదిగాడని చెబుతున్నారు. తమకు రాజకీయ భిక్ష పెట్టింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అని చెబుతున్నారు.
వైయస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యతిరేకించి దూరంగా ఉంటే.. తమ భుజాలపై మోసి ఆయనకు అండగా నిలిచి రాజకీయ జీవితం కల్పించామని ఆనం వివేకానంద జగన్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. వైయస్ చేపట్టిన ప్రజాప్రస్థానంలో విజయరథం వాహనాన్ని తానే ఇచ్చానని, ఇప్పటికీ ఆ రథం ఉందని చెప్పారు. వైయస్ తండ్రి రాజారెడ్డి సర్పంచ్ కాకముందు కోడి పందేలు ఆడుకునేవారని, అప్పటికే తమ కుటుంబంలో ఇద్దరు మంత్రులున్న విషయాన్ని విజయమ్మ గుర్తుంచుకోవాలని అన్నారు.
రాజారెడ్డి కోడి పందేలు ఆడిన స్థలంలోనే వైయస్ సమాధి కట్టారన్నారు. తమ కుటుంబంలో అన్నదమ్ములంతా ఒకే మాటపై నడుచుకుంటారని, అలాంటి తమ మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారంటూ ఆనం విమర్శించారు. తమకు రాజకీయ భిక్ష పెట్టింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్ప వైయస్ కానేకాదన్నారు. ఆయన్ను అడ్డం పెట్టుకుని ఏ లాభం పొందలేదని, కేవలం తమ అత్తగారి ఆస్తులతోనే బతుకుతున్నామని ఆనం చెప్పారు.












Click it and Unblock the Notifications