బాబాయిని పక్కన పెట్టిన జగన్: లిస్టు రెడీలో బిజీ?

జగన్ తన సోదరుడు అనిల్ రెడ్డి సహాయంతో ఈ సర్వేలను చేయిస్తున్నారట. వీటి ఆధారంగా నియోజకవర్గ స్థాయిలో సరిగా పని చేయని వారిని తొలగించి, వారి స్థానంలో సమర్థులను నియమిస్తున్నారంటున్నారు. పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తూనే, నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతున్న వారికి జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారట.
అయితే, జగన్ తన బాబాయి వైవి సుబ్బారెడ్డి వంటి వారికి ఇందులో జోక్యం కల్పించడం లేదంటున్నారు. ఒంగోలు టిక్కెట్ విషయమై అధినేత పైన వైవి సుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో బాబాయిని జగన్ పక్కన పెట్టారంటున్నారు. జగన్, అనిల్ రెడ్డిలే ఈ వ్యవహారాలు చూసుకుంటున్నారంటున్నారు.
గత కొంతకాలంగా జగన్ పని చేసే వారికే టిక్కెట్లు ఇస్తామని పార్టీ వేదికలపై చెబుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ ఖర్చు పెట్టగలిగే వారికే జగన్ లోకసభ టిక్కెట్లు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఎన్నికల సమయంలో తన లోకసభ నియోజకవర్గం ఖర్చుతో పాటు ఆ నియోజకవర్గంలోని శాసన సభ నియోజకవర్గాలకు ఖర్చు చేయగలిగే నాయకులపై ప్రధానంగా దృష్టి సారించారంటున్నారు.
ఒంగోలు లోకసభపై ఆశలు పెట్టుకున్న వైవి సుబ్బారెడ్డి స్థానంలో జగన్ కొత్తగా సురేష్ రెడ్డిని తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నన్నపనేని సుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇక్కడి నుండి బ్రహ్మ నాయుడుకు జగన్ అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. బ్రహ్మ నాయుడు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేశారు. దీంతో అతనికి అక్కడ పట్టు ఉన్నట్లుగా చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే రాజన్న దొర వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో సాలూరు నుండి ఆయనకు హామీ వచ్చిందంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుతో పాటు పలువురు చేరనున్నారు. నంద్యాల లోకసభ స్థానాన్ని భూమా నాగి రెడ్డి ఆశించారు. కానీ ఎస్పీవై రెడ్డి చేరికతో ఆయనకు దక్కనుంది.












Click it and Unblock the Notifications