నల్గొండ ఎన్‌కౌంటర్: జీహాద్ నినాదాలు,ఎవరీ ఇద్దరు?
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలోని జానకీపురం ఎన్‌కౌంటర్లో మృతి చెందిన జకీర్, అస్లాంలు జీహాద్ నినాదాలు చేసినట్లుగా తెలుస్తోంది. వారిని సిమి ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు గతంలో ఖాండ్వా జైలు నుండి తప్పించుకుపోయిన సిమి ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌కు కొద్ది నిమిషాల ముందు జకీర్, అస్లాంలు అర్వపల్లి మండల కేంద్రం నడిబొడ్డున 'చావుకైనా, బతుకుకైనా ఒకేరోజు' అంటూ నినాదాలు చేశారంటున్నారు.
తుపాకులు పైకి చూపుతూ అల్లా హో అక్బర్.. జిహాద్ అని నినదిస్తూ దుకాణ్ బంద్ కరో, అందర్ చలే జావ్ అంటూ దుకాణదారులను హెచ్చరిస్తూ కొద్దిసేపు అర్వపల్లిలో హల్‌చల్ చేశారని తెలుస్తోంది. వీరు చర్యలను బట్టి ఉగ్రవాదులుగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
జకీర్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా వాసి. అతడి తండ్రి ఇసుక వ్యాపారి. అతడు పదో తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత తాపీ పని నేర్చుకుని కొన్నాళ్లపాటు తాపీ మేస్త్రీగా పని చేశాడు. 2008లో నిషేధిత సిమి కార్యకర్త అయినందుకు, ఫేక్ సిమ్‌కార్డు ఉన్న నేరానికి పోలీసులు ఇతణ్ని మొదటిసారి అరెస్టు చేశారు. ఆ తర్వాత యాదవ్ అనే కానిస్టేబుల్ హత్యకేసులో ఇతడి పేరు వినిపించింది.

2011లో సింగ్ అనే మరో కానిస్టేబుల్ హత్య కేసుకు సంబంధించి అరెస్టు చేశారు. అస్లాం కూడా ఖాండ్వావాసి. అతడు ఎనిమిదో తరగతి దాకానే చదువుకుని జకీర్‌లాగానే తాపీ పని చేశాడు. 2011లో జకీర్‌తో కలిసి కానిస్టేబుల్ హత్యకేసులో అరెస్టయ్యాడు. అతడి తండ్రి అయూబ్ మొదట్లో రోజువారీ కూలీగా పని చేసేవాడు. అస్లాం 2005 నుంచి సిమి కార్యకర్తగా పని చేస్తున్నాడు.
కాగా, అస్లాం, జకీర్ ఇద్దరూ చివరి నిమిషం దాకా ఎదురుదాడి చేశారు. ఎంతమందినైనా చంపాలి అనే వైఖరే వారిలో కనిపించినట్లుగా భావిస్తున్నారు. ఉగ్రవాద లక్షణాలు, కార్బైన్ గన్ వంటి ఆయుధం ఉండటం, చంపేందుకు ఏమాత్రం వెనుకాడకపోవడంతో పోలీసులు మొదటి నుంచి జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. దాదాపు ఒకే సమయంలో రెండు బృందాలు రావడంతో దుండగులు కొద్దిసేపు వెనక్కి తగ్గడం పోలీసులకు కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications