వైయస్ జగన్ మంతనాలు: వైసిపిలోకి బొత్స?
విజయనగరం: మాజీమంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ విషయమై గత రెండురోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే విషయమై జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులను ఆ పార్టీ అధినేత జగన్ హుటాహుటిన హైద్రాబాద్‌కు పిలిపించుకుని వారి నుంచి అభిప్రాయాన్ని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, బొత్సను పార్టీలో చేర్చుకునే విషయంలో విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రముఖులు తమ అనుచరులతో చర్చించి చెబుతామని అధినేతకు తెలిపినట్లు సమాచారం. గడచిన ఆరునెలలుగా బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఇటు జిల్లాలో, అటు హైదరాబాద్‌లో ప్రచారం ఊపందుకుంది. కానీ జిల్లా నాయకులు ఎప్పటికపుడు వేచి చూద్దామంటూ జగన్‌కు చెబుతూ వస్తున్నారు. దీంతో ఆయన చేరిక వాయిదా పడుతూవచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.

తాజాగా ఇటు బొత్సకు, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు సన్నిహితుడైన ఒక నాయకుడి ద్వారా మంతనాలు జరిగినట్లు, ఈ సందర్భంగా బొత్సను పార్టీలో చేర్చుకునే విషయంలో జగన్ సానుకూలత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి అనుగుణంగానే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, మాజీ జడ్పీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్‌తోపాటు ఒకరిద్దరు ముఖ్యనాయకులను అధినేత జగన్ హైద్రాబాద్‌కు పిలిపించుకుని విస్తృతంగా చర్చింనట్లు తెలిసింది. బొత్సను పార్టీలో చేర్చుకునే విషయం వీరిముందు జగన్ ప్రస్తావించి అభిప్రాయం కోరినట్లు తెలిసింది.
అయితే పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుందామని కోలగట్ల, సుజయకృష్ణ, బెల్లాన స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే వైసిపిలోని కొంతమంది ముఖ్య నేతలు బొత్స రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. పార్టీలో బొత్స చేరితే, ఆయన అనుచరులు, ఆయన పెత్తనం పెరిగిపోతుందని, దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకున్న తమకు అడ్రస్ లేకుండా చేస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ అనుచరవర్గం ఉన్న బొత్స వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీలో గ్రూపు రాజకీయాలు మొదలవుతాయనే భయాలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే బొత్స వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లా నాయకత్వాన్ని భుజాలపై వేసుకున్న ముఖ్యనాయకులు బొత్స వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరినా తాము మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనాయకులతో ఉన్న విభేదాల కారణంగా బొత్స ఆ పార్టీలో చేరినా, ఆయన అనుచరులుగా ఉన్న కొందరు నాయకులు పార్టీ మారే విషయంలో విముఖత వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.












Click it and Unblock the Notifications