డిగ్గీపై కెవిపి నీడ: డిఎస్ ఔట్, విహెచ్ భగ్గు?
న్యూఢిల్లీ: పార్టీలో యువతకు ప్రాధాన్యం పెంచాలనే కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వ్యూహానికి వంద శాతం వత్తాసు పలుకుతున్న దిగ్విజయ్ సింగ్‌కు ఎదురీత తప్పడం లేదు. తెలంగాణ సీనియర్ నాయకులు మాత్రం దిగ్విజయ్ సింగ్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.
దిగ్విజయ్ సింగ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తి పార్టీని వీడి మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కెవిపి నీడ వల్లనే దిగ్విజయ్ సింగ్ పార్టీకి చేటు తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా, మరో తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత హనుంతరావు కూడా దిగ్విజయ్ సింగ్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పిస్తే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ బాగుపడదని ఆయన అన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో విహెచ్ ఇదే విషయం చెప్పినట్టు తెలిసింది.

హనుమంతరావు శుక్రవారం సోనియా గాంధీని కలిసి సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు దారి తీసిన పరిస్థితుల గురించి వివరించారు. దిగ్విజయ్ సింగ్ ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్లను అవమానించే తీరు ఆమె దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
ఆంధ్రప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు సలహాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు నడిపించటం నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్టు డిఎస్ చేసిన ప్రకటనను సోనియాదృష్టికి తెచ్చారు. కెవిపి తీరుపట్ల తెలంగాణ ప్రాంతానికి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
బొత్స సత్యనారాయణ, డి శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వెళ్లిపోతున్నప్పటికీ దిగ్విజయ్‌సింగ్ మాత్రం పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు. ఇదే అభిప్రాయంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications