తెలంగాణ స్టైల్ 'మటన్ కర్రీ'.. 31st దావత్ స్పెషల్..!
డిసెంబర్ 31 కు ముక్క సొక్కా లేనిదే దావత్ పూర్తి కాదు. అయితే తెలంగాణ ప్రజలకు మటన్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 31st దావత్ స్పెషల్ మటన్ కర్రీ ఇలా చేసుకుంటే ముక్క మిగుల్చకుండా తినేస్తారు. మరి తెలంగాణ స్టైల్ 'మటన్ కర్రీ' ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
తెలంగాణ స్టైల్ 'మటన్ కర్రీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మటన్ అర కేజీ, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి ఆరు లేదా ఏడు, నూనె తగినంత, అల్లం పేస్టు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ లు, నూనె తగినంత, కారం సరిపడా, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి. అలాగే మసాలా కోసం ధనియాలు రెండు స్పూన్ లు, జీలకర్ర ఒక స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు ఏడెనిమిది, యాలకులు ఐదు లేదా ఆరు, జాపత్రి, జాజికాయ, మిరియాలు తీసుకోవాలి..
తెలంగాణ స్టైల్ 'మటన్ కర్రీ' తయారీ విధానం చూస్తే.. ముందుగా మటన్ ముక్కలను కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఇప్పడు అందులో మటన్ ముక్కలు, పసుపు వేసుకొని బాగా కలిసేలా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి మటన్ ను ఐదారు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ క్రమంలోనే రెసిపీలోకి అవసరమైన మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పై మరో గిన్నె పెట్టుకుని అందులో ధనియాలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత అందులో జీలకర్ర, ఎండుకొబ్బరి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, మిరియాలు వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పడు మటన్ మూత మూసి అందులో కారం, ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి అరగంట పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఓసారి మూత తీసి తయారు చేసుకున్న మసాలా పొడిని వేయాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేస్తే సరి.. ఘుమఘుమలాడే టేస్టీ మటన్ కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications