రాత్రి నిద్ర పట్టట్లేదా, పగలు నిద్ర ఆగట్లేదా? డేంజర్ బెల్స్!
పగటిపూట విపరీతమైన బద్ధకం, నిద్రమత్తుగా అనిపించడం, రాత్రి పడుకున్నా గంటల తరబడి నిద్రపట్టకపోవడం.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలు. అయితే, వీటిని కేవలం అలసటగా లేదా సాధారణ బద్ధకంగా మాత్రమే భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె పనితీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని సరికొత్త వైద్య అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
నిద్రపై అధ్యయనంలో షాకింగ్ విషయాలు
రాత్రివేళ నిద్రపట్టడానికి అరగంట కంటే ఎక్కువ సమయం పట్టడం, పగటిపూట నిద్రమత్తుగా ఉండటం అనేవి అధిక రక్తపోటు ముప్పును గణనీయంగా పెంచుతాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సాగించిన తాజా అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు ప్రతికూల లక్షణాలూ ఉన్నవారిలో గుండె జబ్బుల ముప్పు ఇతరుల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రక్తపోటు సహజంగానే 10 నుంచి 20 శాతం వరకు తగ్గుదల
సాధారణంగా రాత్రిపూట కంటినిండా నిద్రపోతున్న సమయంలో రక్తపోటు సహజంగానే 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతుంది. ఈ సమయంలో రక్తనాళాలు తమను తాము పునరుజ్జీవింపజేసుకుని మరుసటి రోజుకు సిద్ధమవుతాయి.ఒకవేళ రాత్రిపూట సరైన నిద్ర లేకపోయినా, పడకపై చేరాక నిద్రపట్టడానికి చాలా సమయం పట్టినా శరీరంలో సహజంగా జరగాల్సిన ఈ బీపీ తగ్గుదల ప్రక్రియ నిలిచిపోతుంది.
దీర్ఘకాలిక హైపర్‌టెన్షన్ సమస్య
దీనివల్ల ధమనులపై ఒత్తిడి రాత్రంతా అలాగే కొనసాగుతుంది. ఫలితంగా రక్తపోటు స్థాయిలు క్రమంగా పెరిగి, దీర్ఘకాలిక హైపర్‌టెన్షన్‌కు దారితీస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది క్రమంగా గుండె జబ్బుల ముప్పును రెట్టింపు చేస్తుంది.శరీరానికి తగినంత విశ్రాంతి దొరకనప్పుడు, అది తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. మెదడు రసాయన సమతుల్యత దెబ్బతిని ఒత్తిడి హార్మోన్లయిన కార్టిసోల్, అడ్రినలిన్ వంటివి రక్తంలోకి అధికంగా విడుదలవుతాయి. ఇవి గుండె వేగాన్ని పెంచి, రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తాయి.
నిద్రలేమితో అధికంగా ఆకలి
అంతేకాకుండా, తీవ్రమైన నిద్రలేమి ఉన్నప్పుడు మెదడులో ఆకలిని పెంచే హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. దీనివల్ల ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు (జంక్ ఫుడ్) తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది. శరీరంలో సోడియం పరిమాణం పెరగడం మరియు బద్ధకం వల్ల వ్యాయామం చేయకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఇది చివరికి రక్తపోటును మరింత పెంచి గుండెను దెబ్బతీస్తుంది.
పగటిపూట నిద్రమత్తు, రాత్రివేళ నిద్రపట్టకపోవడం కనిపిస్తే జాగ్రత్త
రోజువారీగా ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వారిలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే పగటిపూట నిద్రమత్తు, రాత్రివేళ నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సహాయం తీసుకోవడం మంచిది. క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు రక్తపోటును అదుపులో ఉంచి, గుండెను పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.













Click it and Unblock the Notifications