కార్బైడ్ తో పండిన మామిడిపండుకు, సహజంగా పండిన మామిడిపండుకు తేడా ఇదే!!
వేసవికాలంలో మామిడి పండ్లు ప్రతి ఒక్కరినీ నోరూరిస్తాయి. అయితే మామిడిపండ్ల సీజన్లో బయట మార్కెట్లో సహజసిద్ధంగా పండిన పండ్ల కంటే, కృత్రిమంగా పండిన పండ్లే ఎక్కువగా దర్శనమిస్తాయి. మామిడి పండ్లు కృత్రిమంగా రసాయనాలతో పండాయా? లేక సహజ సిద్ధంగా పండాయా అనేది తెలుసుకోవడానికి చాలామంది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మామిడిపండ్ల లో ఉండే కొన్ని లక్షణాలతో అది సహజంగా పండిన పండా లేక కృత్రిమంగా పండిన పండా? అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు.
రసాయనలతో పండిన మామిడిపండుకు, సహజ సిద్ధంగా పండిన మామిడి పండుకు చాలా తేడా ఉంటుంది ఇక అది ఎలా గుర్తించాలి అంటే.. ప్రస్తుతం మన మార్కెట్లలో లభిస్తున్న మామిడి పండ్లు దాదాపు కృత్రిమంగా పండిన పండ్లే. మామిడి పండ్లను రంగు మారేలా, పండేలా చేయడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అది ఉపయోగించకూడదని ఆదేశాలు ఉన్నా సరే కచ్చితంగా కార్బైడ్ వాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు.

కాల్షియం కార్బైడ్ తో పండిన మామిడి పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కార్బైడ్ తో పండే మామిడి పండ్లు, నాచురల్ గా పండిన మామిడిపండ్ల కంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కృత్రిమంగా పండిన మామిడిపండ్లలో అక్కడక్కడ పచ్చగా మచ్చలు ఉంటాయి. అవి పసుపు వర్ణంగా మారిన మామిడిపండులో స్పష్టంగా కనిపిస్తాయి. అదే సహజంగా పండిన మామిడిపండ్లలో అలాంటి మచ్చలు కనిపించవు. సహజంగా పండిన మామిడిపండ్లలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడానికి కట్ చేసినప్పుడు ఎరుపు, పసుపు కలిసిన ప్రకాశవంతమైన రంగులో మామిడి గుజ్జు కనిపిస్తుంది.
ఇక కృత్రిమంగా పండిన మామిడిపండు అయితే లేత మరియు ముదురు పసుపు రంగులో మామిడిపండు లోపల కనిపిస్తుంది. సహజంగా పండిన పండులో ఉన్నట్టు దీనిలో రసం ఎక్కువగా ఉండదు. సహజంగా పండిన మామిడిపళ్ళు చాలా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి. కృత్రిమంగా పండిన పళ్ళలో తీపి తక్కువగా ఉంటుంది. అవి అంత జ్యూసీగా ఉండవు. కాబట్టి మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా గమనిస్తే అవి సహజంగా పండాయా లేక కార్బైడ్ సహాయంతో పండించినవా అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications