పచ్చికారం సొరకాయ కూర.. ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!
ఆధునిక కాలంలో గృహిణులు వేగంగాను, రుచికరంగానూ వండే వంటకాలను తయారు చేయడం కోసం తెగ వెతుకుతున్నారు. అటువంటి వాళ్ళు వేగంగా వండుకోగలిగిన పచ్చిమిర్చి కారంతో సొరకాయ కూరని వండి తింటే అది రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, కేవలం పది నిమిషాల్లోనే రెడీ అవుతుంది.
పచ్చికారం సొరకాయ కూర
తినడానికి సూపర్ గా అనిపించే తక్కువ సమయంలో రెడీ అయ్యే సొరకాయ కూరని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. సొరకాయ కూరను కారప్పొడితో కాకుండా పచ్చిమిర్చి కారంతో తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది.ఇలా వండి తినటం ఆరోగ్యం కూడా..

కావలసిన పదార్థాలు
సొరకాయ- లేతది 1 కట్ చేసి పెట్టుకున్న ముక్కలు
ఉల్లిపాయ- 1 సన్నగా తరిగిన ముక్కలు
పచ్చిమిరపకాయలు- ఆరు
అల్లం- అంగుళం ముక్క
పసుపు- అర స్పూన్
ఉప్పు- ఒకటిన్నర స్పూన్
పోపు గింజలు- ఒక స్పూన్
నూనె- రెండు స్పూన్లు
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని, కుక్కర్లో రెండు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు వేసి, ఆపై కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న సొరకాయ ముక్కలను వేసి కలపాలి.
కుక్కర్ లో ఇలా వండండి
ఆపై అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపిన తర్వాత, పచ్చిమిరపకాయలు అల్లం ముక్కను, గ్రైండర్ లో వేసి పేస్ట్ గా చేసి, ఈ పేస్టును కూరలో ఆడ్ చేయాలి. సొరకాయ బాగా లేతగా ఉంటే అందులోనే నీరు ఊరుతుంది. అలా నీరు ఊరక పోతే కొద్దిగా నీటిని యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
తక్కువ సమయంలో పచ్చికారం సొరకాయ కూర రెడీ
కుక్కర్ మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆపై విజిల్ వదిలిన తర్వాత మూత తీసి మళ్లీ స్టవ్ వెలిగించి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదే సమయంలో కొద్దిగా కొత్తిమీరను కూడా ఆడ్ చేసుకోవాలి. కేవలం పది నిముషాలలోనే రుచికరమైన పచ్చికారం సొరకాయ కూర రెడీ అవుతుంది.












Click it and Unblock the Notifications