ఉక్కులాంటి బలం.. రాయలసీమ 'రాగిసంగటి'.. ఇలా చేస్తే కమ్మగా ఉంటుంది!
రాగి సంగటి.. నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషన్ అని చెబుతారు. తాత ముత్తాతల కాలం నుంచి ఇప్పటి జనరేషన్ వరకూ రాగిసంగటిని తినడానికి ఇష్టపడుతుంటారు. రాగిసంగటిని ఇంట్లోనే తయారు చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఈ రాగిసంగటిని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
ఈ రాగిసంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బియ్యం 1 గ్లాస్, రాగి పిండి 2 గ్లాసులు, నీళ్లు 8 గ్లాసులు, తగినంత నెయ్యి.. రాగిసంగటి తయారీకి తక్కువ పదార్థాలే సరిపోతాయి. ఇక రాగిసంగటి ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా కుక్కర్ లో బియ్యాన్ని శుభ్రంగా కడిగి 8 గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టుకుని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత ఆ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకూ కుకింగ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆ తర్వాత కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నాన్ని కొంచెం మెత్తగా నలుపుకోవాలి. అలా అన్నాన్ని నలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమంలో రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని ఒకే దగ్గర కాకుండా అన్నం మీద సమానంగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 5 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

రాగి పిండి మగ్గిన తర్వాత గరిటెతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అందులో తగినంత నెయ్యి వేసి కొద్దిసేపు ఉడికించాలి. చివరిగా సంగటిపై నీళ్లు చల్లి మరో 3 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో గిన్నె తీసుకోవాలి. గిన్నె లోపలి భాగంలో నెయ్యి అప్లై చేసుకోవాలి. ఆ గిన్నెలోకి రాగి మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుని రౌండ్ గా తిప్పాలి. అప్పుడు సంగటి ముద్దలా వస్తుంది. దాన్ని మరో ప్లేట్ లోకి తీసుకుని ఇష్టమైన కర్రీతో తినడమే.












Click it and Unblock the Notifications