శనగపప్పుతో క్రిస్పీ మసాలా వడలు... ఇలా చెయ్యండి.. లాగించేస్తారు!
నోటికి రుచిగా తినాలని ఎవరు మాత్రం అనుకోరు. ప్రతి ఒక్కరం ప్రతిరోజు నోటికి రుచిగా ఉండేవి తినాలని అనుకుంటాం. అయితే అటువంటి వాటిలో బయట కొనుక్కోవచ్చు కొన్న వాటికంటే, ఇంట్లో తయారు చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆరోగ్యకరమైన పదార్థాలను ఎంపిక చేసుకొని వండుకుని తినడానికి ప్రాధాన్యతను ఇస్తాం.
శనగపప్పుతో చేసిన మసాలా వడలు
సాయంత్రం వేళ స్నాక్స్ కి, వర్షం పడే సమయంలో వేడివేడిగా తినడానికి శనగపప్పు తో చేసిన మసాలా వడలు చాలా బాగుంటాయి. శనగపప్పు తో చేసే క్రిస్పీ మసాలా వడలు అందరికీ ఇష్టమైన స్నాక్స్ అని చెప్పవచ్చు. మరి ఇంట్లో నలుగురికి సరిపోయేలా ఈ క్రిస్పీ మసాలా వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
శనగపప్పు - ఒక కప్పు
పచ్చిమిర్చి - మూడు నుండి నాలుగు
అల్లం - చిన్నముక్క
వెల్లుల్లి- మూడు నాలుగు రెబ్బలు
ధనియాలు- ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ- 1 సన్నగా తరిగినది
ఉప్పు- రుచికి సరిపడా
నూనె - వడలు వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా శనగపప్పును మూడు నుండి నాలుగు గంటలు నానబెట్టి నీళ్లు వంచేసి, కొద్దిగా నీరు వేసి పిండిలా రుబ్బుకోండి. అయితే మరి మెత్తని పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగానే పిండిని మిక్సీ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి కలిపి మళ్లీ కొద్దిగా ఇవ్వండి. ఈ పిండి మిశ్రమంలో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు, ఉప్పు కలిపి వడలపిండి రెడీ చేసుకోండి.
ఇలా చేస్తే క్రిస్పీ మసాలా వడలు రెడీ
ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి నూనె వేడి అయిన తర్వాత, చేత్తో చిన్న చిన్న వడలుగా చేసి వేడైన నూనెలో వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి వాటిని తీసి టిష్యూ కాగితం మీద వేయండి. ఈ వడలకు అదనంగా ఉన్న నీటిని టిష్యూ పేపర్స్ పీల్చుకుంటాయి. అంతే క్రిస్పీగా రుచిగా ఉండే మసాలా వడలు రెడీ అయినట్టే.
వడల పిండి ఇలా ఉంటే నూనె పీల్చుకోవు
అయితే వడల పిండి మాత్రం కాస్త గట్టిగా చేసుకుంటేనే మంచిది. వడల పిండిలో ఎక్కువ నీళ్లు వేస్తే అవి ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. ఈ రుచికరమైన క్రిస్పీ శనగపప్పు మసాలా వడలను టమాటో సాస్ తో తింటే సూపర్ రుచిగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ వర్షాకాలం ఇంట్లో వీటిని తయారు చేసి కుటుంబంతో ఎంజాయ్ చేయండి.












Click it and Unblock the Notifications