నేడే శని త్రయోదశి: డోంట్ మిస్- శని దోష నివారణకు పరిహారాలు
నేడు శని త్రయోదశి. హిందూ సంప్రదాయంలో ఈ పర్వదినానికి ఎంతో విశిష్టత ఉంది. శని త్రయోదశి నాడు రవి యోగం వంటి అత్యంత శుభప్రదమైన సంయోగం ఏర్పడుతుండటంతో ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, పరమశివుడితో పాటు శనిదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీనివల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.
శనివారం నాడు వచ్చే త్రయోదశి తిథిని శని త్రయోదశి, శని ప్రదోషం అని పిలుస్తారు. ఈ శుభ సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు, శని భగవానుడిని శాస్త్రోక్తంగా పూజించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధించి, శని గ్రహ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా శని దోషాలతో బాధపడేవారికి ఈ పూజ ఎంతగానో ఉపశమనం కలిగిస్తుంది.

శని త్రయోదశి పూజ శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి 26వ తేదీ రాత్రి 10: 22 నిమిషాలకు ప్రారంభమైంది. 28వ తేదీ అర్ధరాత్రి 12: 43 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఉదయతిథి ప్రాధాన్యత కారణంగా నేడు శని ప్రదోష వ్రతంగా పరిగణించి పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున పూజ కోసం సాయంత్రం 7: 20 నిమిషాల నుండి రాత్రి 9: 29 నిమిషాల వరకు అత్యంత అనుకూలమైన ముహూర్తం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
శని త్రయోదశి రోజున ఉదయమే స్నానమాచరించి, పూజా మందిరంలో శివలింగానికి గంగాజలం, పాలు, బిల్వపత్రాలు, సమర్పించాలి. ఆ తర్వాత శని భగవానుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నల్లటి వస్త్రాలు వంటివి సమర్పించి పూజించాలి. పూజా సమయంలో "ఓం శం శనైశ్చరాయ నమః" లేదా "ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః" అనే మంత్రాలను రుద్రాక్ష మాలతో 108 సార్లు జపించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి.
శని దోష నివారణకు చేయాల్సిన దానాలు
శని త్రయోదశి పర్వదినాన దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతకంలో శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందడానికి ఈ రోజున అర్హులైన పేదలకు కొన్ని వస్తువులను దానం చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
| దాన వస్తువులు | ఫలితాలు |
|---|---|
| నల్ల నువ్వులు, మినుములు | గత జన్మల పాపకర్మల ప్రభావం తగ్గి, శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. |
| ఆవాల నూనె | శారీరక బాధలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. |
| నల్లటి వస్త్రాలు, చెప్పులు | రాహు-కేతువులతో పాటు శని దోషాలు శాంతించి మానసిక ప్రశాంతత కలుగుతుంది. |
| శక్తి కొలది ధన సహాయం | అభివృద్ధి చెంది, అప్పుల బాధల నుండి ఉపశమనం లభిస్తుంది. |
ఈ పవిత్రమైన రోజున పూజలు, దానాలు చేయడంతో పాటు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఈ రోజున మద్యం, మాంసాహారం వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఎవరినీ అవమానించకుండా, వృద్ధులకు సహాయం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. తద్వారా సాధకులు తమ జీవితాల్లో శాంతి, సౌభాగ్యాలను అందుకోవచ్చు.












Click it and Unblock the Notifications