వినాయక చవితికి సంబంధించిన వాస్తు నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం!!
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగను ఇంటింటా, వాడవాడలా జరుపుకుంటారు. అయితే వినాయక చవితి పండుగను జరుపుకునే వారు గణనాధుని విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. అయితే గణేష్ చతుర్ధి కి సంబంధించిన వాస్తు నియమాలను ఈ సమయంలో పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
ఇంటికి వినాయకుని విగ్రహాన్ని తీసుకురావాలని ఆలోచించేవారు ముందుగా వాస్తు సూత్రాలను గురించి తెలుసుకోవాలి. వాస్తు నియమాల ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అప్పుడే గణేశుడి ఆశీస్సులు మీపై పూర్తిగా ఉంటాయి. ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకు వచ్చేటప్పుడు, విగ్రహాన్ని ఎన్నుకునే టప్పుడు వినాయకుడి తొండం యొక్క భంగిమ దిశను గుర్తుంచుకోవాలి. వినాయకుడి తొండం ఎడమవైపుకు వంగి ఉంటే అది అత్యంత పవిత్రమైనది.

అటువంటి విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఇంట్లో సంతోషం, సంపదలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులకు ప్రశాంత జీవనం లభిస్తుంది. వినాయకుడి విగ్రహంలో వినాయకుడి వాహనమైన ఎలుక మరియు మోదకం ఉండాలనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఎలుక మరియు మోదకం ఉండడం చాలా శుభప్రదమని చెబుతారు.
అంతేకాదు వినాయకుడి విగ్రహాన్ని తీసుకు వచ్చేటప్పుడు దాని రంగును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎరుపు రంగు వినాయకుని ఇంట్లో ప్రతిష్టించడం వల్ల కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోని వారికి ఆనందం ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంటికి గణేశుడు విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత ఉత్తరం దిశ వైపు ప్రతిష్టించాలి. ఈ దిశను లక్ష్మీదేవి మరియు శివునికి అంకితం చేసినట్లు చెబుతారు. లక్ష్మీ మరియు శివుడు ఈ దిశలో నివసిస్తున్నారని ఇది సూచిస్తుంది. గణేశుడు ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
ఉత్తరం వైపు కాకుంటే, వినాయకుడి ముఖం ఇంటి ప్రధాన ద్వారానికి అభిముఖంగా ఉండాలి. అప్పుడు ఇంట్లో ఎల్లప్పుడు సంతోషం, ప్రశాంతత, సిరిసంపదలు ఉంటాయి. వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ప్రతిష్టించాలి అనుకునేవారు ఈ వాస్తు నియమాలను పాటించినట్లయితే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయని, గణేశుడి పూర్తి ఆశీర్వాదం వాళ్లకు ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications