Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తపస్సు అంటే దేవున్ని స్మరించడం కాదు, కార్యసాధన ఆరాటం

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

భగవంతుని కోసం నిరంతము పరితపించడాన్నే తపస్సు అంటారు .

మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించ టాన్నే తపస్సు అంటారు .
నిత్య కృత్యాలు నేరవేరుస్తున్నా భగవంతుని తో అనుసంధానం అయి ఉంది కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు.

'తపస్సు...!' ఈ మాట వినగానే మన మహర్షులు, యోగులు, సిద్ధులు, మునులు ఏళ్లతరబడి చేసిన తపస్సే గుర్తుకొస్తుంది. వారు తమకోసం కాక, లోక కల్యాణార్థం వాయుభక్షణచేస్తూ నిరాహారులై తపస్సు చేశారు. సిద్ధి పొందారు.

What is the meaning of Tapassu?

శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తపస్సును సాత్విక, రాజసిక, తామసికాలనే మూడు విధాలుగా వర్గీకరించి ప్రబోధించాడు. దీన్నే దేవతలు, గురువులు, జ్ఞానుల్ని పూజిస్తూ సేవిస్తూ, శుచి, నిష్కపటం, బ్రహ్మచర్యం, అహింస కలిగి ప్రవర్తించటం శారీరక తపస్సుగా చెబుతారు. ఇతరుల్ని బాధించే మాటలు పలకకుండా, సత్యంగా, ప్రియంగా మాట్లాడటం వాజ్మయ తపస్సు అంటారు. ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటూ మౌనం, ఆత్మనిగ్రహం, భావశుద్ధి కలిగి ఉండటం మానసిక తపస్సు.

మదాహంకారాలతో మూఢంగా ఇతరుల్ని పీడిస్తూ పరుల నాశనం కోరడం ద్వారా తన వినాశనాన్ని పరోక్షంగా ఆహ్వానించడం తామసిక తపస్సుగా చెబుతారు. అలా తామసి తప్పక 'తా' 'మసి' అయిపోతాడని తాత్పర్యం. పౌరాణిక, చారిత్రక వేదికలపైన మనకీ మూడు వర్గాలవారూ కనిపిస్తారు. ఒక పవిత్ర లక్ష్యంతో ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నిస్వార్థ చింతనతో, పరహితార్థభావనతో, తపనతో చేసే దీక్షనే తపస్సు అంటారు. క్రమశిక్షణ, సమయపాలన, ధర్మాచరణ, ధ్యానం తపస్సులోని కీలకాంశాలు.

మనమంతా ఇప్పుడు తపస్సు చేస్తూనేఉన్నాం. నిర్దిష్ట సమయాల్లో నిత్యకృత్యాలను శ్రద్ధగా నిర్వర్తించుకుంటూ కార్యాలయాల్లో కానీ, బయట కానీ, ప్రభుత్వ ప్రభుత్వేతర నిర్దేశిత కార్యక్రమాలను, విధులను నెరవేరుస్తున్నాం.

నేర్చుకున్న జ్ఞానానికీ, విద్యకు, కళకు, అంకితమైపోయి జాతి శ్రేయం కోసమే వాటిని సద్వినియోగం చేయడం మన సనాతన ధార్మిక, తాత్విక సంస్కృతిని పరిపోషించడం, మానవసేవా యాగసమిధలమైపోవడం, సాటి ప్రాణిలో దైవత్వాన్ని చూసి గౌరవించడం, అభిమానించడం, సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ, సత్సాంగత్యం వంటి తపస్సులోని అంతస్సూత్రాలే. తపస్సుకున్న లక్షణాలే.

ఇక్కడే మనం ఆత్మాన్వేషణ చేసుకోవాలి. ఆంతరిక విశ్లేషణ చేసుకోవాలి. మన ఈ తపోగానంలో ఎన్ని అపశ్రుతులు దొర్లుతున్నాయో, అంతర్వీక్ష చేసుకోవాలి.

కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గరనుంచీ ప్రతిదీ వాయిదా వేసుకుంటూంటారు. సమయపాలనకు విలువ ఇవ్వరు. అవసరం లేకున్నా అసత్యాలు వందలు వందలుగా వల్లిస్తూనే ఉంటారు. ఎక్కడ, ఎలా అవకాశం దొరుకుతుందా? ఎవడ్ని ఎలా దోచుకుతిందామా అన్న ఆలోచనలతో ఎదకు, మెదడుకూ పదును పెడుతుంటారు.

తక్కువ శ్రమతో ఎక్కువ ధనమూ, సుఖమూ ఎలా లభ్యమవుతాయా అన్న తపనే తపస్సయిపోతోంది ఇవాళ. ఈ రకమైన ఆలోచనా విధానాన్ని త్యజిస్తేకానీ తపస్సుకు అర్థం బోధపడదు. అది ఒకసారి అవగతమై హృదయంలో తిష్ఠవేసుకుందీ అంటే, అప్పటి ఆనందం అనుభవైకవేద్యం. అది వివేచనాపరులకే సాధ్యం.

ఏదైనా అడుగుతూ తపస్సు చేశామంటే ఆ సర్వజ్ఞుడి విజ్ఞతను తక్కువ అంచనా వేసే అట్టడుగు స్థాయిలో ఉన్నామని అర్థం.

కొంచెం శ్రద్ధ, మరికొంత సంయమనం, ఇంకొంచెం సంస్కారం, మరికాస్త జ్ఞానం, మరింత పట్టుదల ఉంటే జీవనయానమనే తపస్సు సాధ్యమే.

మన సనాతన రథసారథులు సాధకులకోసం మోక్ష ద్వారాన్ని చేరుకోవడానికెన్నో సుగమమైన మార్గాలు చెప్పారు. అవి తెలుసుకోవడానికి మరీ అంత కష్టపడవలసిన పనిలేదు. ఆసక్తి ఉంటే చాలు, 'ఆ'శక్తి దానంతటదే మనల్ని ఆవహిస్తుంది. విజయసుధల్ని ఆహ్వానిస్తుంది. ఆ ఆసక్తిని కూడా చూపక నిరాసక్తులమై, బద్ధక చక్రవర్తులమైతే జీవితంలో ఇంక సాధించేదేంటి? భూమికి భారంగా, చరిత్రహీనంగా జీవించే హక్కు భగవంతుడు మనకివ్వలేదు!

భగవంతుణ్ని మనమేదైనా అడిగే బదులు, అడక్కుండానే మన అవసరాన్ని గ్రహించి ఆయనే తనంతతానుగా మనకు ఇచ్చే విధంగా 'అర్హత'ను మనం ఆర్జించడమే ఉత్తమమైన తపస్సు.

నిత్యజీవన విధానంలోని అంశాలన్నింటినీ- అంటే- స్నానం, ధ్యానం, ఆహారం, నిద్ర, కర్తవ్యం మొదలైనవాటిని తపస్సులోని ప్రధానాంశాలుగా, పవిత్రమైన అంశాలుగా, భావించి, ఆచరించిననాడు మోక్షగవాక్షం మనకళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. అందుకు మనం కటిబద్ధులం కావాలి, నవబుద్ధులం కావాలి

తపస్సు విశిష్ఠత

తపస్సు అంటే ఏమిటి ? ఒక మంత్రాన్నో..., ఏదో ఒక దైవాన్నో ఉపాసిస్తూ., నిరంతర ధ్యానంలో ఉండడమే తపస్సు అనుకుంటే పొరపాటు.

'తపనే' తపస్సు. ఒక కార్యసాధన కోసం అనుక్షణం తపించడమే..., ఆరాటపడడమే 'తపస్సు. అలా తపించినంత మాత్రాన., ఆరాటపడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా అనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు. తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే...మనస్సంకల్పానికి ఉన్న శక్తి, బలము.... ఈ సృష్టిలో దేనికి లేదు. ఆయుధాన్ని వాడకుండా, ఓ మూల పడేస్తే తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. ఆయుధాన్ని నిరంతరం వాడుతూంటే పదునుదేలి..దాని పనితనాన్ని చూపిస్తుంది. అలాగే మనస్సు కూడా. అయితే., ఇక్కడ మీకో సందేహం రావచ్చు.'అయ్యా.. మనస్సు నిరంతరం ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది కదా అని.' నిజమే...ఆలోచించడం వేరు. ఆరాటపడడం వేరు. ఏదో ఒక విషయం గురించి ఆలోచించడాన్ని.., ఆరాటపడడం అనరు. చంచలమైన మనస్సును నియంత్రించి, ఒక నిర్దిష్ఠమైన లక్ష్యాన్ని దానికి నిర్దేశించి., ఆ దిశగా మనసును మళ్ళించడానికి పడే ఆరాటాన్నే., తపననే., తపస్సు అంటారు. అది మంచి అయితే మంచి ఫలితాన్ని.., చెడు అయితే చెడు ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. అందుచేతనే తపస్సు చేసే సాధకుడు మంచినే ఆశించి., విశ్వశాంతిని కాంక్షిస్తూ తపస్సు చేయాలి. అదే నిజమైన తపస్సు. తపస్సు గురించి ఇంత వ్యాఖ్యానం ఇచ్చారు కదా...ఇది నిజం అని నిరూపించడానికి ఏదైనా ఆధారం ఉందా ? అని ప్రశ్నించ వచ్చు. ఆధారం లేకుండా ఏ విషయాన్ని మన ఋషులు ఇంతవరకు ప్రతిపాదించలేదు. దీనికి ప్రకృతి పరమైన ఆధారం ఉంది. సృష్టిలో అందమైన కీటకం 'సీతాకోకచిలుక'. దీని పుట్టుక చాలా వింతగా ఉంటుంది.
సాధారణంగా ఒక ప్రాణి నుంచి అదే విధమైన ప్రాణి పుడుతుంది. ఉదాహరణకు కోడిగ్రుడ్డు నుంచి కోడిపిల్ల పుడుతుంది. సీతాకోకచిలుక పెట్టే గ్రుడ్ల నుంచి సీతాకోకచిలుకలు రావు. గొంగళిపురుగులు వస్తాయి. ఈ గొంగళిపురుగులు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి.ఆ దశలో అది రాళ్ళలో., రప్పల్లో.., ముళ్ళలో తిరుగుతూ., ఆకులు తింటూ కాలం గడుపుతుది. అలా కొంత కాలం గడిచాక తన జీవింతం మీద రోత కలిగి.,ఆహార, విహారాలు త్యజించి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశనికి పోయి., తన చుట్టూ ఓ గూడు నిర్మించుకుని, తపస్సమాధి స్థితిలోకి వెళ్లిపోతుంది. అలా కొంతకాలం గడిచాక, దాని తపస్సు ఫలించాక అది తన గూడు చీల్చుకుని బయటకు వస్తుంది. అయితే అది గొంగళిపురుగులా రాదు. అందమైన సీతాకోకచిలుకలా వస్తుంది. అప్పుడది ఆకులు, అలములు తినదు. పూవుల్లో ఉండే మకరందాన్నే తాగుతుంది. ప్రకృతి ధర్మానికి కట్టుబడి గ్రుడ్లు పెట్టిన మరుక్షణం ఈ సంసార జగత్తులో చిక్కుకోక మరణిస్తుంది. అదీ తపస్సు ఇచ్చే ప్రతిఫలం. అలాగే తపస్సిద్ధి పొందిన మానవుడు ఈ సంసార లంపటంలో చిక్కుకోక.... భగవన్నామామృత పానంతో తరిస్తాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+