బ్రాండెడ్ సైకిళ్లు, ఏఐ కోర్సులు, ల్యాప్ టాప్స్.. జెన్ జీ యువతపై సీఎం విజయ్ వరాల జల్లు
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ బడ్జెట్ లో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా వాళ్లకు టీవీకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. నెక్స్ట్ జనరేషన్ యువతపై సీఎం విజయ్ వరాల జల్లు కురిపించారు. విద్యార్థులకు బ్రాండెడ్ సైకిళ్లు, ఏఐ కోర్సులు, ల్యాప్ టాప్స్ అందించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. బ్రాండెడ్ సైకిళ్ల పంపిణీ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో చదివే దాదాపు 5.32 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ సెకిళ్లకు హెల్మెట్, వాటర్ బాటిల్స్ పెట్టుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ పథకం కోసం టీవీకే ప్రభుత్వం రూ. 277 కోట్లు ఖర్చు చేయనుంది.
అలాగే 2026-27 బడ్జెట్ లోనే 'వెట్రి ల్యాప్ టాప్ స్కీమ్' ను ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా కాలేజీ విద్యార్థులకు రూ. 2 వేల కోట్లతో ల్యాప్ టాప్ లను అందజేయనున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ను ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా 2031 నాటికి ఇంజినీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ లు, ఐటీఐల్లోని దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు సాంకేతికతలో శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం తమిళనాడు స్టూడెంట్ హౌజింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TNSHIC) ను ఏర్పాటు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. టీఎన్- సుధార్ కార్యక్రమం ద్వారా లక్ష బెడ్స్ తో రాష్ట్రవ్యాప్తంగా 200 ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్ హాస్టల్స్ ను నిర్మించనుంది. పబ్లిక్- ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ ద్వారా ఈ హాస్టల్స్ నిర్మాణం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం బడ్జెట్ లో రూ. 3,200 కోట్లను టీవీకే ప్రభుత్వం కేటాయించింది. అలాగే మై- హోమ్ పథకం కింద వచ్చే ఏడేళ్లలో చెన్నై మెట్రో పాలిటన్ ప్రాంతంలో అల్పాదాయ కుటుంబాలకు లక్ష ఇళ్లను నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తెలిపారు.

ఇక వెట్రి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద 12 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు అలాగే లక్ష మంది నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను అందించేందుకు బడ్జెట్ లో రూ. 150 కోట్లను తమిళనాడు ప్రభుత్వం కేటాయించింది. అలాగే 20 వేల మంది విద్యార్థులకు ఇంటెర్న్ షిప్ సదుపాయం కల్పించనుంది. అలాగే టేక్ అప్ స్పోర్ట్స్.. గీవ్ అప్ డ్రగ్స్ కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో ప్రతి రోజూ ఒక గంట పాటు గేమ్స్ ను ప్రతిపాదించింది. అలాగే 10 ఒలింపిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను రూ. 50 కోట్లతో నిర్మించనుంది. మొత్తానికి సీఎం విజయ్ తన తొలి బడ్జెట్ లో జెన్ జెడ్, జెన్ ఆల్ఫా వాళ్లపై వరాల జల్లు కురిపించారు.
పాత పథకాలకే కొత్త పేర్లు..
విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ పంపిణీ పథకాన్ని మొదటగా 2011 లో అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించింది. ఇప్పుడు సీఎం విజయ్ సారధ్యంలోని టీవీకే ప్రభుత్వం ఈ పథకానికి "వెట్రి మదిక్కనిని తిట్టమ్" అని పేరు మార్చింది.
అలాగే డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకొచ్చిన "ముదల్వార్ పడైప్పగమ్" పథకాన్ని విజయ్ సర్కార్ "డిజిటల్ నూలగమ్" అని పేరు మార్చినట్లు డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పథకం కింద చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో విద్యార్థులకు కో లివింగ్ సదుపాయం, డిజిటల్ లైబ్రరీ సదుపాయం అందించనుంది. ఇక ఉచిత సైకిళ్ల పంపిణీ పథకం గతంలోనే తమిళనాడులో అమలు అవుతోంది. ఇప్పుడు విజయ్ సర్కార్ ఈ పథకానికి "నవీన మితివండీ తిట్టమ్" అని పెట్టింది.
వీటితో పాటు "అరసు మతిరి పల్లిగల్", "తగైసల్ పల్లిగల్" పథకాలను "కామరాజార్ సిరప్పు పల్లిగల్" అని మార్చింది టీవీకే ప్రభుత్వం. గత డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకొచ్చిన "నాన్ ముదల్వాన్ తిట్టమ్" పథకాన్ని టీవీకే ప్రభుత్వం "వెట్రి తిరన్ పయిర్చి తిట్టమ్" అని పేరు మార్చింది.
అలాగే "ఆడు మాత్రమ్ సెమ్మరి ఆడు వలార్పు ఊక్కువిప్పు తిట్టమ్" పథకాన్ని "వెట్రి మగలిర్ ఆడుగల్ వలార్పు తిట్టమ్" గా మార్చారు. "కలైజ్ఞార్ కనావు ఇల్లమ్ తిట్టమ్" పథకాన్ని "వెట్రి వీడు వాజంగమ్ తిట్టమ్" గా మార్చారు. అలాగే "అంబు సోలై తిట్టమ్" పథకాన్ని "ముదియోర్ పోజుతుపొక్కు తిట్టమ్" గా మార్చేశారు. ఇక "నన్నిలమ్ మగలిర్ నీల్ ఉరిమై తిట్టమ్" పథకాన్ని "మన్నిన్ మాగల్ తిట్టమ్" గా మార్పు చేసింది టీవీకే ప్రభుత్వం.












Click it and Unblock the Notifications
