• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శివమంత్రాన్నే మృత్యుంజయ మంత్రమని ఎందుకంటారు? దోసపండుకు, మృత్యువుకు సంబంధమేంటి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం /
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ //

అర్ధం :-
అందరికి శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును (శివుడును) ఆరాదిస్తున్నాను. దోసపండు కాడ నుండి విడినట్లు మరణం పట్టు నుండి విడివడెదను గాక!

ఈ మంత్రమును ఎందుకు మృత్యుంజయ మంత్రమంటారు? అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు? అసలు దోసపండుకు, మృత్యువుకు ఏమిటి సంబంధం ఏమిటి? .

What is the proper way to chant Maha Mrityunjaya Mantra?

మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు జీవించి ఉండడం కాదు పునర్జన్మ లేకపోవడం.అంటే ఇకముందు జననమరణాలు లేకపోవడం. అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం. ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, జీవించి వుండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం. అది ఎలాగంటారా?

ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి. సామాన్యముగా ఈ దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది. జ్ఞానత్వం పొందిన వ్యక్తి కూడా అంటే జ్ఞాని కూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడివడతాడు. అంటే మాయనుండి విడివడతాడు. పండిన దోసపండు తొడిమ నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన వున్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయినను దేహ ప్రారబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడై వుంటాడు. (జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే వున్నను, మాయ విడివడడంతో ఇవి ఏవీ అంటక అత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ వుండే వ్యక్తి) ముక్తస్థితిలో వుంటాడు. ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జననమరణాలు లేనిస్థితిలో వుంటాడు. పునర్జన్మ లేదు అని అంటే మృత్యువును జయించడమే కదండీ.
ఈసరికే మీకు అర్ధమై యుంటుంది, దోసపండుతో ఎందుకు పోల్చారోనన్నది.
ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుండాలంటే -

శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం.
మీకు తెలుసు కదా, ఆదిగురువు శివుడు అన్న విషయం. ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి. అందులో వున్న ఆధ్యాత్మిక రహస్యాలను శోదించండి. శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు -

పంచభూతాత్మకుడు :-

శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

త్రయంబకుడు :-

శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

నామము :-

శివనామం లోని మూడుగీతలు జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు, మధ్యబిందువును తురీయావస్థలకు చిహ్నం. అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్ధాలు చెప్తుంటారు, ఈ జగత్తంతయూ త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు కమ్మూ, అని సూచిస్తుందని అంటుంటారు. అటులనే శివవిష్ణ్యాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని (బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేనని తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు.

విభూతిదారుడు :-

సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

త్రిశూలం :-

సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మికశక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం.

నాగాభరణుడు :-

సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు. పై మంత్రమును మామూలుగా చదివితే అకాలమృత్యువునుండి ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. అలా కాకుండా పారమార్ధిక సాధనగా గ్రహించి ఆరాదిస్తే ముక్తస్థితి లభిస్తుంది. అందుకే శివున్ని లయకారుడు అంటారు. లయకారుడు అంటే లీనం చేసుకోవడం లేదా తనలో కలుపుకోవడం.

శివుణ్ణి ఆరాధించడమంటే శివుని పటంను అలకరించి కాసేపు పూజించడం కాదు. శివుని దివ్యరూపం వ్యక్తపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక అంతరార్ధములను అవగాహన చేసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధనా కూడా ఏ రీతిలో వుండాలో శివరూమే తెలుపుతుంది. సాధారణంగా శివుడు ధ్యానంలో ఆసీనుడైనట్లు దర్శనమిస్తుంటాడు. ఆ రూపం ద్వారా నిరంతరం బాహ్యప్రపంచమును కాంచే కనులను గట్టిగా కాకుండా అంటి అంటనట్లు మూసి వుంచి, దృష్టిని భ్రూమధ్యాన లగ్నం చేసి అంతర్ముఖులై సత్యంను దర్శించమన్న సూచనను గ్రహించి సాధన చేసినట్లయితే జీవుడు శివుడవుతాడు.
తన రూపం ద్వారా జ్ఞానబోధ చేస్తున్న శివమంత్రం ఎందుకు మృత్యుంజయ మంత్రమైందో ఇప్పుడు మీకు అర్ధమై వుంటుంది.
మనం తరుచుగా వింటుంటాం, మనసెరిగి నడుచుకో, చిత్రాన్ని కాదు చిత్తాన్ని చూడు, శోధించి సాదించు అన్న మాటలను.
ఇలాంటి అంతరార్ధములను తెలుసుకుంటున్నప్పుడు అర్ధమౌతుంటుంది - పెద్దలు పలికే పలుకుల్లో పరమార్ధం.

English summary
The Maha Mrityunjaya Mantra is said to have been created by Rishi Markandeya. ... Om Trayambakam Yajamahe, Sugandhim Pushti Vardhanam, Urvarukmiv Bandhanat, Mrityurmokshaya Mamratat. ... Benefits of chanting Maha Mrityunjay Mantra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X