కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని..
దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ దిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదులాజాబ్ ప్రాంతంలో సకెర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ఐదంస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దిల్లీలో శనివారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులు, ఉరుముల ప్రభావంతో భవనం కూలినట్లు తెలుస్తోంది. కూలిపోయిన భవన శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న వెంటనే దిల్లీలోని అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేసింది. స్థానిక పోలీసులు, వైద్య బృందం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
ఇక ఐదంస్తుల భవనం కుప్పకూలగానే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన ధూళితో నిండిపోయింది. భయంతో చుట్టుపక్కల ప్రజలు కేకలు వేసుకుంటూ పరుగులు తీశారు. సంఘటనా స్థలంలో బాధితుల బంధువుల ఆర్తనాదాలు, కేకలతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిథిలాల కింద చాలామందే చిక్కుకుని ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు శిథిలాల కింద నుంచి ఒక్కొక్కరిగా క్షతగాత్రులను వెలికి తీసి తరలించేందుకు వీలుగా ఘటనా స్థలంలో అంబులెన్స్ లను కూడా సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం అక్కడ సహయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక వాతావరణ శాఖ దిల్లీ లో రెడ్, ఆరెంజ్ అలర్ట్ లను జారీ చేసింది. నగరంలో గంటకు 70 నుంచి 90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ తీవ్రమైన గాలులు, వర్షాల కారణంగానే ఈ భవనం కుప్పకూలినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications