తొలివిడత పోలింగ్‌లో హింస
హైదరాబాద్ ః రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మంగళవారం నాడు జరిగిన తొలి విడత పోలింగ్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఘర్షణలు, బ్యాలెట్ బాక్స్‌ల అపహరణ, పోలీసు కాల్పుల వంటి సంఘటనలు జరిగాయి. మొత్తానికి మాత్రం పోలింగ్ సజావుగానే సాగిందని చెప్పవచ్చు. సగటున 76 శాతం మేర పోలింగ్ జరిగింది. 22 జిల్లాల్లోని 27 డివిజన్లలో ఏడు వేల పై చిలుకు గ్రామపంచాయతీల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులకు పోలింగ్ జరిగింది.
మంగళవారం నాడు ధర్మవరం, ఉట్నూరు,అసిఫాబాద్, రాజంపేట, తిరుపతి, పెద్దాపురం, రామచంద్రాపురం, తెనాలి, ఖమ్మం, సిరిసిల్ల, జగిత్యాల, కర్నూలు,విజయవాడ, గుడివాడ, సిద్దిపేట, నాగర్ కర్నూలు, గద్వాల్, సూర్యాపేట, నెల్లూరు, బోధన్, ఒంగోలు, రంగారెడ్డు, పాలకొండ,విశాఖపట్నం, వరంగల్, జనగాం, ఏలూరు రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరిగింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 16న జరుగుతుంది.
పొద్దున్న ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం వరకు మెజార్టీ స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు కావడంతో పార్టీల బలాబలాలనుఅంచనావేయడానికి ఫలితాలను బట్టి అంచనాకు వచ్చే అవకాశం లేదు. ఉపసర్పంచ్ ఎన్నికను కూడా మంగళవారం రాత్రే ముగించాలని అధికారులు నిర్ణయించారు. కోస్తా జిల్లాల్లో వర్షాలు, తెలంగాణ జిల్లాలు, ఎజెన్సీ ప్రాంతాల్లో నక్సలైట్లు పోలింగ్ ప్రక్రియకు కొద్దిమేర అంతరాయం కలిగించారు.
చాలా ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన కారణంగా ఓట్ల లెక్కింపులో కూడా జాప్యం జరిగింది. పోలింగ్ సందర్భంగా రెండు వేరువేరు సంఘటనల్లో ఒక పోలింగ్ అధికారి, ఒక పోలీసు అధికారి మరణించారు. నల్లగొండ జిల్లాలో రాజయ్య అనే హెడ్‌మాస్టర్, కర్నూల్ జిల్లాలో నారాయణస్వామి అనే ఎస్‌ఐ మరణించారు. అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించిన నారాయణస్వామి
తోపులాటలో కిందపడగా ప్రమాదవశాత్తు ఆయన పిస్తోలుపేలిందని అధికారులు చెప్పారు. ఊహించినట్టుగానే ఎంత పోలీసు బందోబస్తు చేసినప్పటికీ ఫాక్షనిస్టు జిల్లాల్లో ఘర్షణలను పోలీసులు నివారించలేకపోయారు. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తులుపెద్దఎత్తునే ఘర్షణలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో కూడా నిజాంపట్నం మండలంలో కూడా ఈ రెండు పార్టీలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి.












Click it and Unblock the Notifications