జడ్‌పి చైర్మన్ సోదరుడు సహా ఏడుగురి అరెస్టు
హైదరాబాద్: అక్రమ భూ ఆక్రమణ కేసులో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ సోదరుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలో అక్రమ భూ ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణపై వారి మీద కేసులు నమోదయ్యాయి.
కాసాని జ్ఞానేశ్వర్ సోదరుడు కాసాని కృష్ణతో సహా ఆగం పాండు, కొలను కృష్ణారెడ్డి, శ్రీనివాస రెడ్డి, సోమమ్య, ఓదయ్య, కుమార్‌లపై ల్యాండ్ గ్రాంబింగ్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజింగ్ యాక్టుల కింద కేసులు నమోదయ్యాయి. వారిని పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు పదహారు రోజుల జ్యుడిష్యల్ రిమాండ్ విధించింది. అనంతరం వారిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు. బాచుపల్లి భూ వివాదం ఇటీవల కొంత కాలంగా చెలరేగుతోంది. బాచుపల్లిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణపై ఆ భూములలోని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ ఇళ్లు నిర్మించుకున్నవారు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత జ్ఞానేశ్వర్ స్వయంగా గృహ యజమానులతో కలసి అధికారుల చర్యను తప్పు పడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ప్రదర్శన నిర్వహించారు.











Click it and Unblock the Notifications
