ఎన్టీఆర్ పేరు తొలగింపుపై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు పెట్టకపోవడంపై తెలుగుదేశం నేతృత్వంలో ప్రతిపక్షాల పార్లమెంటు సభ్యులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు ప్రధానికి ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న బేగంపేట విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు, ఇంటర్నేషనల్ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు ఉన్నాయని, శంషాబాద్‌లో నిర్మిస్తున్న విమానాశ్రయానికి కూడా అదే పద్ధతిలో పేర్లు ఉంచాలని వారు ఆ విజ్ఞాపనపత్రంలో అన్నారు.
తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో పాటు భారతీయ జనతా పార్టీ (బిజెపి), అన్నాడియంకె, సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రధానిని కలిసినవారిలో ఉన్నారు. ఎన్టీ ఆర్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విషయమని, ఎన్టీ ఆర్ పేరు తొలగిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటాయని వారన్నారు.
వైయస్ ప్రభుత్వం శంషాబాద్ వద్ద తలపెట్టిన కొత్త విమానాశ్రయానికి ఐక్య ప్రగతిశీల కూటమి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారంనాడు శంకుస్థాపన చేశారు.












Click it and Unblock the Notifications